దిశ నిందితులపై చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్య

Sun Dec 08 2019 15:24:21 GMT+0530 (IST)

Chief Justice SA Bobde on Hyderabad Encounter

హైదరాబాద్ లో జరిగిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లోని హైకోర్టు భవనం ప్రారంభించిన సందర్భంగా జోధ్ పూర్ లో రాష్ట్రపతి కేంద్ర న్యాయ శాఖ మంత్రి సమక్షంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.దిశ ఎన్ కౌంటర్ ను ఉద్దేశించి సీజేఐ బోబ్డే మాట్లాడుతూ ‘ఎలాంటి విచారణ జరుపకుండా  తక్షణ న్యాయం ఎప్పటికీ సాధ్యం కాదని’ తేల్చిచెప్పారు. న్యాయం ఎన్నటికీ ప్రతీకారంగా మారకూడదని.. అలా మారితే న్యాయం తన సహజ గుణాన్ని విలువను కోల్పోతుందని సంచలన కామెంట్స్ చేశారు.

ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్న దారుణాలకు కోర్టులో పరిష్కారానికి తీసుకుంటున్న సమయం ఆలస్యమవుతుందన్న విమర్శల నేపథ్యంలో చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ఈ క్రమంలోనే నేర న్యాయవ్యవస్థను మరింత కఠినం చేయాల్సి ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు.

ప్రజల భావోద్వేగాల ప్రకారం హైదరాబాద్ లో జరిగిన ఎన్ కౌంటర్ ను పరోక్షంగా సీజేఐ తప్పుపట్టినట్టైంది. ప్రజల కోరిక మేరకు తక్షణ న్యాయం సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ తెలిపారు.