Begin typing your search above and press return to search.

చెవిరెడ్డి వారసుడే అక్కడ అభ్యర్ధిగా..జగన్ ఓకేనట...!

By:  Tupaki Desk   |   27 March 2023 8:00 PM GMT
చెవిరెడ్డి వారసుడే అక్కడ అభ్యర్ధిగా..జగన్ ఓకేనట...!
X
వైసీపీ లో చెవిరెడ్డి భాస్కర రెడ్డి కీలక నాయకుడు. జగన్ కి అత్యంత ఇష్టుడు. ఎంత ఇష్టం లేకపోతే ఆయనకు అనేక పదవులు ఒకేసారి ఇస్తారు అని సొంత పార్టీ వారే చెవులు కొరుక్కుంటారు. చెవిరెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే. రెండవమారు వరసగా ఆయన గెలిచారు. ఆయనను తుడా చైర్మన్ గా జగన్ నియమించారు. తుడా చైర్మన్ హోదాలో ఆయన టీటీడీ బోర్డు కు ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉంటున్నారు.

పార్టీపరంగా చూస్తే ఆయన సోషల్ మీడియా విభాగం కో ఆర్డినేటర్. చెవిరెడ్డి అందరి వాడు. ఆయనకు టీడీపీ లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. వైసీపీ లో చాలా తక్కువ మందికి ఉండే అరుదైన స్నేహాలు, అన్ని పార్టీల బంధాలు చెవిరెడ్డి సొంతం. ఆయన అన్ని పార్టీలతో బాగా ఉన్నా జగన్ కూడా ఆయన మీద పెద్ద నమ్మకం పెట్టుకుని ప్రోత్సహిస్తారు.

వైఎస్సార్ ఫ్యామిలీలో రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి నుంచి కూడా జగన్ దాకా చెవిరెడ్డి ఇంటి మనిషిగా ఉంటూ వచ్చారు. చంద్రగిరిలో 2024లో కచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని సర్వేలు చెబుతున్నాయి. దాంతో ఈసారి తాను కాకుండా తన పెద్ద కుమారుడు మోహిత్ రెడ్డిని నిలబెట్టాలని చెవిరెడ్డి చూస్తున్నారు.

మోహిత్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి రూరల్ ఎంపీపీ గా కొనసాగుతున్నారు. రాజకీయంగా ఆయన దూకుడు గా ఉంటారు. తండ్రి చెవిరెడ్డికి తోడుగా ఉంటున్నారు. ఆయన తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ మధ్యనే చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్రకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు.

తండ్రికి తగిన తనయుడిగా ఉన్న మోహిత్ రెడ్డికి జనంలో మంచి పేరు ఉంది. పార్టీ అండ ఉండి. తండ్రి భాస్కరరెడ్డి వ్యూహాలు ఉన్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ తెచ్చుకుంటే కచ్చితంగా గెలిచి వస్తారని అంటున్నారు. అయితే జగన్ వారసులకు టికెట్ ఇవ్వను సీనియర్ నేతలే 2024 ఎన్నికల్లో పోటీకి దిగాలని చెప్పినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా చెవిరెడ్డి కుమారుడిని జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి తనకు బదులుగా కుమారుడిని పెట్టి గెలిపించుకుని వస్తానని జగన్ ముందు చెప్పి తగిన హామీ పొందారన్న వార్త ఇపుడు చాలా మంది సీనియర్లల్తో వారసులు ఉన్న వారిలో కొత్త రకం ఆశలను కలుగచేస్తోంది అని అంటున్నారు.

చెవిరెడ్డి భాస్కరరెడ్డి విషయానికి వస్తే ఆయన వయసు ఇంకా తక్కువే. ఆయన మరిన్ని ఏళ్ళు రాజకీయంగా చురుకుగా ఉండే అవకాశం ఉంది. కానీ ఆయన తన వ్యాపారాలు, ఇతరత్రా సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలని చూస్తున్నారుట. పైగా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారుట.

ఈ ముందు చూపుతోనే రెండేళ్ళ క్రితం జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కుమారుడి ని ఎంపీపీ గా దింపి రాజకీయంగా పరిచయం చేశారు. ఇపుడు అనుభవం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేను చేసి ఆ ముచ్చటను చూడాలని అనుకుంటున్నారు. మొత్తానికి చెవిరెడ్డి భలే ప్లాన్ వేశారని వైసీపీలో ఇతర నాయకులు అంటున్నారు.

చెవిరెడ్డికి జగన్ ఓకే చెప్పారు కాబట్టి ఇపుడు వైసీపీలో వారసుల జాబితా అమాంతం పెరిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మొత్తం మీద చంద్రగిరిలో ఈసారి కొత్త ముఖం వైసీపీ నుంచి రాజకీయంగా పరిచయం అవుతుంది అన్నది ష్యూర్ అంటున్నారు. మోహిత్ రెడ్డి ఫస్ట్ ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అవుతారని అంతా ఆశిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.