Begin typing your search above and press return to search.

నరాల తెగే ఉత్కంట పోరులో చెన్నై చేతికే ఐపీఎల్ ట్రోఫీ

By:  Tupaki Desk   |   30 May 2023 9:57 AM GMT
నరాల తెగే ఉత్కంట పోరులో చెన్నై చేతికే ఐపీఎల్ ట్రోఫీ
X
పదహారో ఐపీఎల్ ట్రోపీ ఎవరిది? అన్న ఉత్కంట తీరిపోయింది. ఇప్పటివరకు ఉన్న సెంటిమెంట్లకు చెక్ చెప్పి మరీ మహీ సారథ్యంలోని చెన్నై జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి బంతి వరకు విజయం ఎవరిదన్న టెన్షన్ పుట్టించి.. చివరకు చెన్నై జట్టును వరించిన విజయం క్రికెట్ అభిమానుల్ని ఉప్పొంగిపోయేలా చేసింది. వర్షం కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఆదివారం మ్యాచ్.. రిజర్వుడే అయిన సోమవారం సాయంత్రం జరిగింది. ఐపీఎల్ పదహారో ట్రోఫీ చెన్నై సూపర్ కింగ్స్ చేతికి చిక్కింది. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు నిరాశ తప్పలేదు. ఆఖరి బంతికి విజయం తేలిన ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో చెన్నై జట్టు విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకుంది.

ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీలో ఎప్పుడూ ఎంట్రీ ఇవ్వని వరుణుడు ఈసారి అందుకు భిన్నంగా ఆదివారం అనూహ్య ఎంట్రీ ఇవ్వటం.. మ్యాచ్ సోమవారానికి వాయిదా పడటం తెలిసిందే. సోమవారం వరుణుడి ముప్పు ఉంటుందన్న అంచనాలకు తగ్గట్లే.. అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన వైనం తుది ఫలితం మీద ప్రభావాన్ని చూపిందనే చెప్పాలి. ఐపీఎల్ ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వారికే విజయం సొంతం అవుతుందన్న సెంటిమెంట్ ఉన్న వేళలో.. టాస్ గెలిచిన చెన్నై జట్టు సారధి.. అందరి అంచనాలకు భిన్నంగా బౌలింగ్ తీసుకోవటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే.. ధోనీ అంచనా తప్ప లేదు. మ్యాచ్ కు వర్షం ముప్పు ఉన్న వేళ.. తొలుత బౌలింగ్ చేస్తే కలిసి వస్తుందన్న ధోనీ అంచనా నిజమైంది. అయితే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు సాధించటంతో.. చెన్నైజట్టుకు విజయం కష్టమని డిసైడ్ కావటమే కాదు.. ధోనీ నిర్ణయం తప్పు అన్న భావన కలిగింది. అయితే.. చెన్నై జట్టు తన బ్యాటింగ్ మొదలు పెట్టి.. గుజరాత్ జట్టు వేసిన మూడు బంతుల అనంతరం వరుణుడు మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది.

రెండున్నర గంటల తర్వాత మ్యాచ్ తిరిగి ఆరంభమైంది. దీంతో మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించి.. 171 పరుగులు చెన్నై విజయలక్ష్యంగా డిసైడ్ చేశారు. అద్భుతంగా రాణించిన చెన్నై జట్టు చివరి బంతిలో లక్ష్యాన్ని చేరుకోవటం సూపర్ విజయం చెన్నై సొంతమైంది. ఐపీఎల్ టోర్నీలో ఐదుసార్లు విజయం సాధించిన ముంబయి జట్టుకు సమానంగా చెన్నై నిలిచింది. ఇప్పటివరకు నాలుగుసార్లు టోఫ్రీని సొంతం చేసుకున్న చెన్నై జట్టు.. తాజాగా ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది. తీవ్ర ఉత్కంట నడుమ.. అత్యంత హోరాహోరీగా సాగిన ఆఖరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ చేతికి ఐపీఎల్ టోఫ్రీ మరోసారి చిక్కింది. గుజరాత్ జట్టు ఆశలు ఆడియాశలు అయ్యాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు తమ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 214 పరుగులతో భారీ స్కోర్ ను నమోదు చేసింది. సాయి సుదర్శన్ 47 బంతుల్లో 96 పరుగులు.. వ్రద్ధిమాన్ సాహా 39 బంతుల్లో 54 పరుగులు.. శుభ్ మన్ గిల్ 20 బంతుల్లో 39 పరుగులు సాధించటంతో గుజరాత్ జట్టు భారీ స్కోర్ ను నమోదు చేయగలిగింది. లక్ష్య చేధనకు దిగిని చెన్నై జట్టు మూడు బంతుల్ని ఎదర్కొని నాలుగు పరుగులు సాధించిన వేళలో.. వర్షం కురవటంతో రెండున్నర గంటల పాటు మ్యాచ్ ను నిలిపేశారు.

అనంతరం ఆట మొదలయ్యే వేళలో డక్ వర్త్ టూయిస్ పద్దతిలో 15 ఓవర్లలో విజయ లక్ష్యాన్ని 171గా మార్చారు. చెన్నై బ్యాటర్లు కాన్వే 25 బంతుల్లో 47 పరుగులు.. దూబె 21 బంతుల్లో 32, రహానే 13 బంతుల్లో 27 పరుగులతో రాణించటంతో చెన్నై జట్టు విజయం సాధించేలా చేసింది. వర్షం కారణంగా ఆట నిలిచి.. రెండున్నర గంటల తర్వాత మ్యాచ్ ప్రారంభమైన తొలి బంతి నుంచే చెన్నై బ్యాటర్లు పరుగుల వరద పారించే పనిని షురూ చేశారు. చెలరేగిపోయిన కాన్వే.. రుతురాజ్ దెబ్బకు 4 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 52 పరుగులు చెన్నై ఖాతాలో పడ్డాయి.

13 బంతుల్లో 27 పరుగులు సాధించిన రహానె ఐట్ అయ్యాక గుజరాత్ జట్టుకు విజయం మీద ఆశలు మొదలయ్యాయి. దీనికి తగ్గట్లే స్కోర్ బోర్డు కూడా చెన్నై జట్టుకు విజయం ఎంత కష్టమన్న విషయాన్ని తెలియజేసింది. 20 బంతుల్లో 51 పరుగులు సాధించాల్సిన వేళ.. క్రీజ్ లో ఉన్న దూబె.. రాయుడు చెన్నై జట్టును ఆదుకున్నారు. రషీద్ బౌలింగ్ లో దూబె వరుసగా రెండు సిక్సర్లు బాదితే.. మోహిత్ బౌలింగ్ లోరాయుడు వరుసగా 6,4,6 బాదేయటంతో కొండలా ఉన్న స్కోర్ బోర్డు ఒక్కసారి కరిగి.. చెన్నై జట్టుకు అనుకూలంగా మారింది. 15 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన వేళ.. మోహిత్ అనూహ్యంగా పుంజుకొని వరుస బంతుల్లో రాయుడు.. ధోనిని ఔట్ చేశారు. ఈ మ్యాచ్ లో సున్నా పరుగులకే సారధి ఔట్ అయిన పరిస్థితి.

ఇక్కడే గుజరాత్ జట్టు మ్యాచ్ మీద పట్టు సాధించింది. చివరి ఓవర్ వేసే బాధ్యతను మోహిత్ కు అప్పగించారు. మొదటి నాలుగు బంతుల్ని కట్టుదిట్టంగా వేసిన మోహిత్ దెబ్బకు చెన్నై ఆశలు ఆడియాశలే అన్నట్లుగా పరిస్థితి మారింది. చివరి రెండు బంతులకు 10 పరుగులు అవసరమైన వేళ.. జడేజా ఐదో బంతిని సిక్సర్ గా మరల్చటంతో ఒక బంతికి నాలుగు పరుగులు అవసరమయ్యాయి. ఇలాంటి వేళ.. చివరి బంతిని ఫోర్ కు పంపిన జడేజా దెబ్బకు చెన్నై జట్టును ఐపీఎల్ ట్రోఫీ వరించింది. దీంతో స్టేడియంలో పసుపు దళం పండుగ చేసుకున్నారు. ధోనీ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేయనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. 42 ఏళ్ల వయసులో మరో ట్రోఫీని అందుకోవటం ద్వారా కెరీర్ లోనూ పతాక ఘట్టాన్ని చినస్మరణీయం చేసుకున్నారని చెప్పాలి.