యడియూరప్పకు చెక్...రిసార్ట్ లో కీలక నేతల భేటీ

Sat Jul 04 2020 22:30:51 GMT+0530 (IST)

Check For Yeddyurappa ... Meeting of key leaders at the resort

కర్ణాటకలో కుమార స్వామి సర్కార్ ను కుప్పకూల్చి బీజేపీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలో కొనసాగుతోన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ....యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేసింది. కేంద్ర అండదండలతో రిసార్టు రాజకీయాలను రసత్తరంగా నడిపిన యడ్డీ....కుమారస్వామిని గద్దె దించడంలో సఫలమయ్యారు. సంకీర్ణ కూటమికి వెన్నుపోటు పొడిచిన 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు యడ్డీ సర్కార్ కు మద్దతిచ్చారు. తనకు మద్దతిచ్చిన వారికి మంత్రి పదవులు కీలక పదవులు ఇస్తానన్న యడ్డీ...సీఎం అయిన తర్వాత మాట నిలబెట్టుకున్నారు. బీజేపీలో చేరిన జంప్ జిలానీలకు యడ్డీ పెద్దపీట వేశారు. వారిలో కొందరు అమాంతం అమాత్య పదవులూ అలంకరించారు. ఇంతవరకు సాఫీగానే సాగినా....సొంతపార్టీలో ఈ పరిణామం చాపకింద నీరులా మారింది. వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కీలక పదవులు కట్టబెట్టడంతో ఏళ్ల తరబడి బీజేపీనే నమ్ముకొన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. యడియూరప్ప స్థానంలో మరొకరిని సీఎం చేయాలని...పార్టీని నమ్ముకన్న వారికి న్యాయం చేయాలని కర్ణాటక బీజేపీలోని పలువురు సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీలోని అంతర్గత ముసలాన్ని యడ్యూరప్ప పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తాజాగా కన్నడనాట మరోసారి రిసార్ట్ రాజకీయాలకు తెర లేచింది. చిక్ మంగుళూరులోని ఓ రిసార్టులో కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు కీలక నేతలు సమావేశం కావడం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. యడియూరప్పను గద్దె దించేందుకే వారంతా రహస్యంగా భేటీ అయ్యారన్న ప్రచారం కన్నడ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది.కర్ణాటకలో మరోసారి రిసార్టు రాజకీయాలు ఊపందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి చెందిన కీలకమైన నేతల రహస్య సమావేశం కన్నడ నాట రాజకీయ దుమారానికి తెరలేపింది. ఈ సమావేశంలో బెంగళూరు కోవిడ్ ఇన్‌చార్జి ఆర్.అశోక్ ఇతర మంత్రులు సీటీ రవి జగదీశ్ శెట్టర్ ఈశ్వరప్పలు పాల్గొన్నారు. అంతేకాకుండా సతీశ్ రెడ్డి మునిరాజు కృష్ణప్ప తదితర ప్రముఖ నాయకులు హాజరుకావడంతో యడియూరప్పకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని పుకార్లు వినిపిస్తున్నాయి. రహస్య భేటీ అనంతరం వీరంతా రాత్రికిరాత్రి తిరిగి బెంగళూరుకు చేరుకోవడంతో అక్కడ ఏం చర్చించుకున్నారన్న సంగతి సస్పెన్స్ గా మారింది. సీఎం యడియూరప్ప ఆయన తనయుడు విజయేంద్ర కార్య వైఖరిపై ముఖ్యంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. యడ్డీకి వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేత బసన్నగౌడ పాటిల్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. యడ్డీ వ్యతిరేక ఎమ్మల్యేలను బసన్నగౌడ కూడగట్టి....తిరుగుబాటు బావుటా ఎగువవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. యడ్డీ స్థానంలో సీఎం కావాలన్న యోచనతోనే బసన్నగౌడ రెబల్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాము ఎలాంటి రహస్య సమావేశం ఏర్పాటు చేయలేదని మంత్రి ఆర్.అశోక్ వెల్లడించారు. ఏది ఏమైనా మరోసారి కర్ణాటకలో రాజకీయ నాటకం మొదలైందని చర్చ జరుగుతోంది.