Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు ఏపీకి చంద్ర‌బాబు..ఈ స‌మ‌యంలో విశాఖ‌కు అవ‌స‌ర‌మా?

By:  Tupaki Desk   |   25 May 2020 9:10 AM GMT
ఎట్ట‌కేల‌కు ఏపీకి చంద్ర‌బాబు..ఈ స‌మ‌యంలో విశాఖ‌కు అవ‌స‌ర‌మా?
X
దాదాపు రెండు నెల‌ల పాటు సొంత రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ను వ‌దిలి తెలంగాణ‌లో ఉన్న టీడీపీ అధినేత‌ - మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎట్ట‌కేల‌కు ఏపీలోకి అడుగుపెట్టారు. మార్చి 22వ తేదీన హైదరాబాద్‌ కు వ‌చ్చిన చంద్రబాబు ఆ త‌ర్వాత లాక్‌ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో హైద‌రాబాద్‌ కే ప‌రిమియ్యారు. ఏపీలోకి వెళ్ల‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం లాక్‌ డౌన్ స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో స్వ‌రాష్ట్రం ఏపీకి వెళ్లేందుకు చంద్ర‌బాబు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే అంత‌ర్రాష్ట్ర రాక‌పోక‌ల‌కు అనుమ‌తి లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబును ప్ర‌త్యేక వ్య‌క్తిగా గుర్తిస్తూ అత‌డిని రాష్ట్రంలోకి అడుగుపెట్టేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ నుంచి రోడ్డు మార్గాన సోమ‌వారం చంద్ర‌బాబు నాయుడు ఏపీలోకి అడుగుపెట్టారు.

తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్‌ పోస్ట్ వ‌ద్ద చంద్రబాబు కాన్వాయ్ కృష్ణా జిల్లాలోకి వ‌చ్చారు. అయితే వాస్త‌వంగా చంద్ర‌బాబు నాయుడు విశాఖ‌ప‌ట్ట‌ణం వెళ్లాల‌నే ప్లాన్ ఉంది. కాక‌పోతే సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైన విమాన సేవ‌ల‌ను మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభిస్తామ‌ని ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది. అంటే సోమ‌వారం విమానాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తించ‌లేదు. దీంతో చంద్ర‌బాబు నాయుడు విశాఖ ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకుని నేరుగా గుంటూరు జిల్లాలోని తాడేపల్లి‌లోని తన నివాసానికి చేరుకు‌న్నారు. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు.

వాస్త‌వంగా చంద్ర‌బాబు నాయుడు విశాఖ‌ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించి ఎల్జీ పాలిమ‌ర్స్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ప్ర‌ణాళిక రూపొందించారు. ఊహించ‌ని రీతిలో విమానాలు ర‌ద్ద‌వ‌డంతో విశాఖ‌ప‌ట్ట‌ణం వెళ్లే ప్ర‌య‌త్నం విర‌మించుకున్నారు. అయితే ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆయ‌న విశాఖ‌ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించ‌డం అవ‌స‌ర‌మా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న వ‌స్తే మందీమార్బ‌లంతో పాటు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. వారిలో ఏ ఒక్క‌రికి వైర‌స్ ఉన్నా ఘోరంగా జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో విశాఖ ప‌ర్య‌ట‌న విర‌మించుకుని ఇంటికే ప‌రిమితం కావాల‌ని సూచిస్తున్నారు. పైగా 60 ఏళ్ల‌కు పైగా వ‌య‌సు ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఆరుబ‌య‌ట తిరిగితే ఆయ‌న ఆరోగ్యానికే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు చెబుతున్నారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాలు వ‌దిలేసి స‌మాజ ఆరోగ్యం కోసం ఆలోచించాల‌ని సూచిస్తున్నారు.