అబ్బే.. చంద్రబాబుకు ఆ పదవి వద్దేవద్దట!

Sun May 19 2019 12:58:23 GMT+0530 (IST)

Chandrababu naidu Not Interested with Prime Minister Post

తను ప్రధానమంత్రి కావాలని అనుకోవడం లేదని ఢిల్లీ వెళ్లినప్పుడల్లా చెబుతూ ఉన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు! ఈ అంశంపై చంద్రబాబు నాయుడు మరోసారి స్పందించారు! 'ప్రధానమంత్రి కావాలని అనుకోవడం లేదు.. దేశం బాగుపడాలని అనుకుంటున్నాను..' అని చంద్రబాబు నాయుడు సెలవిస్తున్నారు! భారతీయ జనతా పార్టీ వ్యతిరక కూటమిని కట్టడమే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నారు.ఈ తరుణంలో తనకు ప్రధాని కావాలనే కోరిక ఏదీ లేదని బాబు చెప్పుకొచ్చారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు వివిధ పార్టీల అధినేతలను కలుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకీ కూటమి కట్టడం ఎంత వరకూ వచ్చిందో కానీ..చంద్రబాబు నాయుడు ఇళ్లిళ్లూ తిరుగుతూ ఉన్నారు.

గతంలో ఎన్టీఆర్ కేంద్రంలో క్రియాశీల పాత్ర పోషించాడని ఇప్పుడు తను ఆ పని చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఫలితాలు రాకముందే చంద్రబాబు నాయుడు తనదే క్రియాశీల పాత్ర అని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే అసలు కథ తేలేది మాత్రం ఫలితాలు వెల్లడి అయిన తర్వాతే అని చెప్పనక్కర్లేదు.

మే 23న వచ్చే ఫలితాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదాన్ని బట్టే ఎవరి పాత్ర ఏమిటి? అనేది తేలే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఫలితాలు వచ్చే వరకూ వేచి ఉండేలా లేరు. జాతీయ రాజకీయాలపై ఢిల్లీలో ఉన్న నేతలకే క్లారిటీ లేకుండా పోయింది.

ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ఎవరు ఏ కూటమిలో ఉంటారో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఎస్పీ బీఎస్పీ అధినేతలు కూడా ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఎవరికి వారు ఎన్నికల పనులు ముగించుకుని ఇళ్లకు పరిమితం అయ్యారు. చంద్రబాబు నాయుడు మాత్రం అలాంటి వారందరినీ కలుస్తూ.. ఏదో హడావుడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత హడావుడి చేసినా చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియాలో ఈ హడావుడినంతా కథనాలుగా రాయించుకోగలరు కానీ అంతకు మించి సాధించేది ఉండకపోవచ్చు. ఫలితాలు అధికారికంగా వెల్లడి అయ్యేకే అసలు కథ!