Begin typing your search above and press return to search.

రాబోయే ఐదేళ్లలో ఏం చెప్పాలో బాబు ప్రిపేర్ అవుతున్నారా?

By:  Tupaki Desk   |   18 April 2019 6:39 AM GMT
రాబోయే ఐదేళ్లలో ఏం చెప్పాలో బాబు ప్రిపేర్ అవుతున్నారా?
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీరును చూస్తూ ఉంటే..రాబోయే ఐదేళ్ల ఆయన ఏం వాదన వినిపించాలో రెడీ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల పోలింగ్ మొదలైన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. పోలింగ్ రోజునే మొదలుపెట్టేశారు. ఈవీఎంలు సరిగా పని చేయడం లేదని - ఈవీఎంలను ట్యాంపర్ చేశారంటూ..చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు. ఒకవైపు ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉండగానే బాబు 'ఈవీఎంలు పని చేయడం లేదు..ముప్పై శాతం ఈవీఎంలు సరిగా వర్క్ చేయడం లేదు..' అంటూ మొదలుపెట్టారు.

అయితే బాబు వాదన పూర్తిగా అబద్ధమని అప్పటికప్పుడు ఈసీ స్పష్టం చేస్తూ వచ్చింది. ముప్పై శాతం ఈవీఎంలు సరిగా పని చేయడం లేదనేది శుద్ధ అబద్ధమని..కొన్ని ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తిన మాట వాస్తవమే కానీ, వాటి శాతం చాలా చాలా తక్కువ అని ఈసీ స్పష్టత ఇచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు అంతటితో ఆగలేదు!

అప్పటి నుంచి అదే పాటే పాడుతూ ఉన్నారు. 'ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి.. కనీసం సగం వీవీ ప్యాట్స్ ను కౌంట్ చేయాలి...' అంటూ చంద్రబాబు నాయుడు వాదిస్తూ ఉన్నారు. అయితే ఇది అసంబద్ధమైన వాదనగా తేలిపోతూ ఉంది.

తెలుగుదేశం అధినేత తాము గెలిచినప్పుడేమో ఈవీఎంలను తప్పు పట్టలేదు. గత సార్వత్రిక ఎన్నికలూ ఈవీఎంల మీదే జరిగాయి. నంద్యాల ఉప ఎన్నికలూ ఈవీఎంల మీదే జరిగాయి. అయితే అప్పుడంతా చంద్రబాబు నాయుడు ఈవీఎంల పనితీరు మీద ఏమీ మాట్లాడలేదు.

ఆ మధ్య ఈవీఎంల విషయంలో ట్యాంపరింగ్ పై సీఈసీ ఓపెన్ చాలెంజ్ చేసినా.. చంద్రబాబు నాయుడు స్పందించలేదు. తీరా పోలింగ్ అయిపోయినదగ్గర నుంచి బాబు ఒకే వాదననే అరిగిపోయేలా వినిపిస్తూ ఉన్నారు. ఇదంతా వ్యూహాత్మకం అని..జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదనే లెక్కలతోనే చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారని, ఓడిపోయాకా ఈవీఎంల మీద అభాండాలు వేస్తే జనాలు నవ్వుతారని, అందుకే ఇంకా ఫలితాలు రాకనే ఇలా మాట్లాడేస్తే ఒక పని అయిపోతుందన్నట్టుగా.. ఐదేళ్ల పాటు ఇదే వాదనను అరగదీస్తూ ఉండొచ్చని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు!