Begin typing your search above and press return to search.

కాకినాడ మీద చంద్ర‌బాబు దృష్టి, నిల‌బెట్టుకుంటారా?

By:  Tupaki Desk   |   25 Sep 2021 10:30 AM GMT
కాకినాడ మీద చంద్ర‌బాబు దృష్టి, నిల‌బెట్టుకుంటారా?
X
ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం చేతిలో ఉన్న అతి త‌క్కువ మున్సిపాలిటీల్లో ఒక‌టి కాకినాడ‌. బ‌హుశా టీడీపీ ఖాతాలో ఉన్న‌ది రెండే మున్సిపాలిటీలు కాబోలు. వాటిల్లో ఒక‌టి కాకినాడ‌. టీడీపీ హ‌యాంలో జ‌రిగిన ఏకైక మున్సిపాలిటీ ఎన్నిక కాకినాడ‌లోనే జ‌రిగింది. అప్పుడు టీడీపీ ఈ సీటును ద‌క్కించుకుంది. అయితే ఇప్పుడు టీడీపీలో విబేధాలు తలెత్తాయి. మున్సిప‌ల్ చైర్మ‌న్ సుంక‌ర పావ‌నిపై టీడీపీ వార్డు కౌన్సిల‌ర్లు తిరుగుబాటు చేశారు.

ఈ ప‌రిణామాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప‌యోగించుకున్న‌ట్టుగా ఉంది. ఇప్ప‌టికే టీడీపీ తిరుగుబాటుదారులు కాకినాడ సిటీ ఎమ్మెల్యేతో వ‌ర‌స పెట్టి స‌మావేశాలు అయిన వార్త‌లు వ‌చ్చాయి. వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చేరి కొత్త మున్సిప‌ల్ చైర్మ‌న్ ను ఎన్నుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో సుంక‌ర పావ‌ని వెళ్లి చంద్ర‌బాబును క‌లిశారు. తిరుగుబాటు గురించి స‌మాచారం ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

ఈ ప‌రిణామం నేప‌థ్యంలో చంద్ర‌బాబు కూడా స్పందించార‌ట‌. కాకినాడ‌లో త‌మ పార్టీ త‌ర‌ఫున నెగ్గిన కౌన్సిల‌ర్లంద‌రికీ విప్ ను జారీ చేయ‌నున్నార‌ట‌. మ‌ళ్లీ మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక జ‌రిగితే.. విప్ ను ధిక్క‌రించే వారిపై వేటు త‌ప్ప‌ద‌ని కూడా చంద్ర‌బాబు చెప్పార‌ట‌. ఇలా కాకినాడ మున్సిపాలిటీని కంట్రోల్లో పెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. అయితే.. ఈ హెచ్చ‌రిక‌ను అక్క‌డి టీడీపీ నేత‌లు ఖాత‌రు చేస్తారా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం.

ఎలాగూ ఇప్ప‌టికే అక్క‌డ ప‌ద‌వీ కాలం మూడేళ్ల‌కు పైనే పూర్త‌యిన‌ట్టుగా ఉంది. ఒక‌వేళ త‌మ‌పై అన‌ర్హ‌త వేటు ప‌డినా.. మ‌ళ్లీ మున్సిపాలిటీకి ఎన్నిక‌లు నిర్వ‌హించిన‌ట్టుగా ఉంటుంది. అన‌ర్హ‌త వేటు కూడా అంత తేలిక‌గా ప‌డుతుంద‌నేది అనుమాన‌మే! అయితే ఏదేమైనా ఫిరాయిస్తే చ‌ర్య‌లుంటాయ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించ‌డం విశేషం. గ‌తంఓ 23 మంది ఎమ్మెల్యేల‌కు, అయిన కాడికి వైఎస్ఆర్ సీపీ ద్వారా గెలిచి వ‌చ్చిన వారిని చేర్చుకున్న చంద్ర‌బాబు ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో ఫిరాయించే వారికి మాత్రం తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు!