Begin typing your search above and press return to search.

పార్లమెంట్ లో బాబు... ?

By:  Tupaki Desk   |   28 Nov 2021 1:30 AM GMT
పార్లమెంట్ లో బాబు... ?
X
చంద్రబాబు రాజకీయాలే వేరే లెవెల్ లో ఉంటాయి. అందుకే ఆయన్ని వ్యూహకర్త అని అంటారు. చంద్రబాబు ఇపుడు వైసీపీ మీద పూర్తిగా గురి పెట్టేశారు. ఆయన గత రెండున్నరేళ్ళుగా పొలిటికల్ గా పోరాడుతున్నా ఆయనలోని కసిని అంతకంతకు పెంచి పోషిస్తున్నది కచ్చితంగా వైసీపీ పెద్దలే అన్నది నిజం. బాబును గట్టిగా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు బాబు వేస్తున్నారు.

దాంతో ఇపుడు బాబు మరోసారి తన వ్యూహాలకు తెర తీశారు. దేశానికి అత్యున్నత వేదిక అయిన పార్లమెంట్ లో ఏపీ రాజకీయాలను ప్రస్థావించాలని నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీలో బాబుకు జరిగిన అవమానాన్ని కూడా అటు లోక్ సభ ఇటు రాజ్యసభలలో టీడీపీ ఎంపీలు లేవనెత్తుతారు అంటున్నారు. ఆ దిశగా బాబు దిశనిర్దేశం చేశారని అంటున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఏ కోశానా లేదన్న దానిని హైలెట్ చేయాలని, దానికి ఇటీవల తన పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడితో పాటు అసెంబ్లీలో తన కుటుంబం మీద చేసిన నీచ ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యల మీద పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరీ అక్కడ వైసీపీని ఇరుకునపెట్టాలని బాబు ఎంపీలకు సూచించారు.

అంతే కాదు, ఏపీ సర్కార్ తీరుని దేశమంతా చూసేలా చేయాలని బాబు గట్టిగా కోరుకుంటున్నారు. తన పార్టీ ఆఫీస్ మీద దాడి ఘటనను ఢిల్లీలో మీడియా ముందు పెట్టి కొంత రచ్చ చేసిన బాబు అప్పట్లో రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు. ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ వేడి అలా ఉండగానే అసెంబ్లీలో తనను ఘోరంగా వైసీపీ ఎమ్మెల్యేలు పరాభవించిన తీరుని కూడా ఎండగట్టాలని బాబు కోరుకుంటున్నారు.

మొత్తానికి చంద్రబాబు తాను వైసీపీని అసలు వదలను అంటున్నారు. వైసీపీ ఏపీలో సాగిస్తున్న అనుచిత పాలన, విపక్షాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరుని దేశంలోని అన్ని పార్టీలకు తెలియచేయడం ద్వారా జగన్ ఇమేజ్ ని బదనాం చేయాలని చూస్తున్నారు. మొత్తానికి చూస్తే బాబు తన రాజకీయ జీవితంలో ఎంపీగా ఎపుడూ పార్లమెంట్ కి వెళ్లలేదు. అయితేనేమి ఈసారి తన ఎంపీల ద్వారా పార్లమెంట్ లో తాను ఉండేలా చూసుకుంటున్నారుట. మరి టీడీపీ ఎంపీలు కచ్చితంగా ఏపీ సర్కార్ కి వ్యతిరేకంగా గళం విప్పడం ఖాయం. దానికి కౌంటర్ గా వైసీపీ ఎంపీలు ఎలా రియాక్ట్ అవుతారు. అసలు ఒక రాష్ట్రంలో జరిగిన వివాదాలు, గొడవలు పార్లమెంట్ లో ఎంతవరకూ చర్చకు అనుమతిస్తారు అన్నది కూడా చూడాలి.