కాపు కోటాపై బాబు చిత్తశుద్ధి..ఎంత చెప్పుకొన్నా తక్కువే..!

Wed Jul 17 2019 20:00:01 GMT+0530 (IST)

రాష్ట్రంలో తమకంటూ.. ప్రత్యేక రిజర్వేషన్ లేదా బీసీల్లో కోటా కోరుతున్న ఏకైక సామాజిక వర్గం కాపులు. తాజాగా ఈ అం శంపై నిన్నటికి నిన్న అసెంబ్లీ దుమ్మురేగిపోయింది. ఆకలితో నకనకలాడుతున్న వాడికి తోలు బొమ్మ ఇస్తే.. ఏం చేస్తాడో అందరికీ తెలిసిందే. సరిగ్గా - ఈ విషయాన్ని ఎలుగెత్తారు మాజీ సీఎం చంద్రబాబు. కాపులకు తాము ఎన్నో చేశామని చెప్పు కొచ్చారు. తాము చేయనిది ఏదీ లేదన్నారు. తొలిసారిగా రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని - వారికి విద్య - రుణాలు అందించామని అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే నిజానికి చంద్రబాబు చాలా విజ్ఞుడు. అపర చాణిక్యుడిగా కూడా ప్రపంచం ఆయనను గుర్తించింది.అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఈ అపర చాణిక్యత అభాసు పాలవుతుందనేందుకు బాబు తీసుకున్న కొన్ని నిర్ణయా లు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి చేయాలని బాబు అనుకున్నారు. అయితే అంతకు మించి తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాపులు దండయాత్ర చేశారు. దీనిని సాధ్యమైనంత వరకు అణిచి వేసినందుకే కదా.. నేడు ఆయన ప్రతిపక్షానికి పరిమితయ్యారనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆకలితో ఉన్నవాడికి కుదిరితే పట్టెడన్నం పెట్టు.. అన్నారే తప్ప వెళ్లగొట్టు!! అని ఎక్కడా ఎవరూ చెప్పలేదు. కానీ చంద్రబాబు మాత్రం కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి - తుని ఘటనను అడ్డు పెట్టుకుని వారిని 3 ఏళ్లకు పైగా వేధించారు.

కాపు ఉద్యమకారులను గృహనిర్బంధాలు చేశారు. కాపు నాయకుడు మాజీ మంత్రిముద్రగడ పద్మనాభంపై అనధికార అజమాయిషీ చలాయించారు. ఆయన కుటుంబాన్ని 24 గంటల పాటు ఇంట్లోనే జైలు పాలు చేశారు. ఇవన్నీ దాచాలన్నా దాగని నిజాలు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాపుల కళ్లకు గంతలు కట్టాలని నిర్ణయించుకున్న చంద్రబాబు.. అప్పటికే సుప్రీం కోర్టు తీర్పు కత్తి తలపై వేలాడుతున్నా.. తనకేమీ తెలియదన్నట్టుగా రాష్ట్ర అసెంబ్లీలో కాపు కోటాపై తీర్మానం చేసి చేతులు దులుపుకొన్నారు. ఇక తన చేతుల్లో ఏమీలేదు - అంతా కేంద్రమే చూసుకోవాలి. మనల్ని కేంద్రం వేధి స్తోంది. మీరు కూడా కలసి రండి అందరం పోరాడదాం.. అంటూ నయవంచన పలుకులు రువ్వారు. అమ్మ పుట్టిల్లు మేన మామకు తెలియదా?! అన్నట్టు రాష్ట్రంలో చంద్రబాబు ఎవరికి ఏం చేస్తున్నారో.. తెలియని అమాయాకులు కాపులు కాదు. అందుకే ఎన్నికల సమయంలో ఏం చేయాలో అదే చేశారు.

కాపుల విషయంలో చివరగా బాబు చేసింది.. మరింత విడ్డూరం.. అగ్రవర్ణ పేదలకు కేంద్రం ఇచ్చిన 10% రిజర్వేషన్ లో అప్పనంగా కాపులకు 5% ఇచ్చారు.(దీనికి కేంద్రం నుంచి వెసులు బాటు ఉన్నప్పటికీ.. ఒకే సామాజిక వర్గానికి ఇవ్వరాదని స్పష్టంగా ఉంది.) దీని ద్వారా కాపుల ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని బాబు నిర్ణయించుకున్నారు. అయితే విజ్ఞులైన కాపులు .. ఎన్నిసార్లు మోస పోతాం అనుకున్నారో .. ఏమో.. బాబును బాబుకు బాకాగా మారిన సొంతసామాజిక వర్గానికి చెందిన పార్టీని సైతం తుదముట్టించారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో కాపులను మాయ చేద్దామనుకన్న బాబు వారి చేతిలో చావుదెబ్బతిని నేడు కనీసం ఆత్మ పరిశీలన కూడా చేసుకోకపోవడం గమనార్హం.