వైసీపీ గవర్నమెంట్.. టీడీపీ పాలన చేయాలా?

Wed Sep 11 2019 12:19:36 GMT+0530 (IST)

Chandrababu Naidu Demands TO Jagan over Welfare Schemes in Andhra

ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించారు. చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించారు. ఏదో నామమాత్రంగా మాత్రమే టీడీపీ ఉనికి చాటుకుంది ఎన్నికల్లో. స్వయంగా చంద్రబాబు నాయుడి తనయుడు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయేంత స్థాయి వ్యతిరేకతను ఎదుర్కొంది తెలుగుదేశం.ఇలాంటి క్రమంలో ఎన్నికలు అలా అయిపోయాయో లేదో.. ఇంతలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు తమ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. తమ హయాంలో ఏదో అద్భుతాలు చేసినట్టుగా తమ పథకాలను అమలు చేయాలంటూ వారు మాట్లాడుతూ ఉండటమే విడ్డూరంగా మారింది.

ప్రజలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఆ పార్టీ పథకాలు వద్దు - ఆ పార్టీ పాలన వద్దని వారు క్లియర్ గా తీర్పును ఇచ్చారు. అది ఫలితాలతో స్పష్టం అయిన విషయం. అయినా తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రం తమ పథకాలు.. అంటూ మాట్లాడుతూ ఉన్నారు.

తాము చేస్తామంటూ ఎన్నికల హామీలను ఇచ్చిన పథకాలను - తాము అమలు చేయలేక ఇప్పుడు జగన్ వాటిని అమలు చేయాలంటూ వారు మాట్లాడుతూ ఉండటం గమనార్హం. రుణమాపీ పథకం అమలులో తాము ఫ్లాప్ అయినట్టుగా - ఇప్పుడు దాన్ని జగన్ చేయాలన్నట్టుగా స్వయంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇక మిగతా నేతలు కూడా అలానే మాట్లాడుతూ ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ కొన్ని పథకాల రూపంలో భారీగా దోచుకుందని అధికార వర్గాలు ఇప్పుడు ధ్రువీకరిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పచ్చ పార్టీ వాళ్లు ఆ మేరకు డిమాండ్ లు చేస్తూ ఉండటం గమనార్హం.  బహుశా ఆ పథకాలను కొనసాగిస్తే టీడీపీకి దోపిడీకి ఇప్పుడు కూడా అవకాశం ఉందేమో అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. అయినా ప్రజలే తిరస్కరించేశాకా.. ఇంకా టీడీపీ నేతల లొల్లి ఎందుకో అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.