అఖిలప్రియకు పొగపెడుతున్న చంద్రబాబు

Mon Aug 06 2018 12:13:15 GMT+0530 (IST)

భూమా నాగిరెడ్డి మరణంతో ఆయన తనయ అఖిలప్రియను మంత్రిని చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ తరువాత ఎందుకో ఆమెకు వ్యతిరేకంగా నంద్యాల టీడీపీలో జరుగుతున్న ఏ చర్యనూ ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా అఖిల వ్యతిరేకవర్గం మాటకే చంద్రబాబు ఎక్కువగా మద్దతిస్తున్నారన్న ప్రచారం కూడా పార్టీలో ఉంది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి. ఒకప్పుడు భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా ఉండి.. ఆయన మరణం తరువాత అఖిలకు పూర్తిగా శత్రువుగా మారిపోయిన ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు కీలక పదవి కట్టబెట్టారు. ఏపీ విత్తనాభివృద్ధి ఛైర్మన్ గా ఏవీ సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవి ఇచ్చారు.
   
భూమా నాగిరెడ్డి యువకుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనకు ముఖ్య అనుచరుడిగా - స్నేహితుడిగా అన్నీ తానే అయి చూసుకున్నారు ఏవీ సుబ్బారెడ్డి. కానీ.. నాగిరెడ్డి మరణం తరువాత నాగిరెడ్డి కుమార్తె అఖిల - ఏవీసుబ్బారెడ్డిల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. అయితే.. నాగిరెడ్డి ఉన్నప్పుడు ఎన్నడూ ఏ పదవి చేపట్టేలేదు ఏవీ సుబ్బారెడ్డి. కానీ.. ఇప్పుడు ఆయనకు చంద్రబాబు నామినేటెడ్ పదవి ఇవ్వడంతో నంద్యాల రాజకీయం ఆసక్తి కరంగా మారింది. అఖిలకు ప్రత్యామ్నాయంగా ఆమెను సిద్ధం చేస్తున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది.
   
కాగా సుబ్బారెడ్డితో  పాటు మరో అయిదుగురికి రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు వరించాయి.  ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బొడ్డు వేణుగోపాల్ (కృష్ణా జిల్లా)ను నియమించారు. ఏపీ ఖాదీ - గ్రామీణ బోర్డు ఛైర్మన్ గా దొమ్మేటి సుధాకర్ (పశ్చిమగోదావరి) - అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి బోర్డు ఛైర్మన్ గా కాకి గోవిందరెడ్డి (విశాఖపట్నం) - నూర్ బాషా-దూదేకుల ముస్లిం కార్పొరేషన్ సొసైటీ ఫెడరేషన్ ఛైర్మన్ గా బబన్ (కర్నూలు) - మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా బూరగడ్డ వేదవ్యాస్ లను నియమించారు.