జగన్ ఓటమి గురించి ఢిల్లీలో చాటుతున్న బాబు

Tue Dec 06 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Chandrababu About YS Jagan Defeat

ఏపీలో వైసీపీ పని అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ స్థాయిలో చాటుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన రెండు రోజులుగా హడావుడి చేస్తున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మీద ఢిల్లీ వెళ్ళిన బాబు జీ 20 సన్నాహక మీటింగులో పాలుపంచుకున్నారు. ఆ తరువాత రెండవ రోజు కూడా ఆయన ఢిల్లీలోనే విడిది చేయడం విశేషం.చాలాకాలానికి ఢిల్లీ వచ్చిన బాబు తన వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నారు. జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులతో బాబు గత రాత్రి డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిసింది. అదే విధంగా వారితో ఆయన చిట్ చాట్ చేస్తూ ఏపీలో మొత్తం రాజకీయ పరిస్థితులను పూసగుచ్చినట్లుగా వివరించారని అంటున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద బాబు వారికి అన్నీ చెప్పారని జనాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత జగన్ మీద ఉందని వివరించే ప్రయత్నం చేశారని అంటున్నారు.

ఎపుడు ఎన్నికలు జరిగినా కూడా ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని ఆయన ఢంకా బజాయించి మరీ చెప్పారని టాక్. ఇక 150 సీట్లకు తక్కువ కాకుండా టీడీపీకి వచ్చే ఎన్నికల్లో సీట్లు రాబోతున్నాయని బాబు ఒక బిగ్ నంబర్ ని కూడా వారి ముందు ఉంచారట. జాతీయ స్థాయిలో ప్రముఖ మీడియా హౌస్ ల నుంచి తాను ఎంచుకున్న ప్రతినిధులతోనే బాబు డిన్నర్ పార్టీ ఇచ్చారని అంటున్నారు.

ఇక రెండవ రోజు మధ్యాహ్నం ఆయన తెలుగు మీడియా ప్రతినిధులకు విందు ఏర్పాటు  చేసే ఏపీలో రాజకీయం గురించి మొత్తం చెప్పారని అంటున్నారు. రీసెంట్ గా తాను పర్యటించిన గోదావరి జిల్లాలతో పాటు కర్నూల్ జిల్లా టూర్ లో సైతం జనాలు బ్రహ్మ రధం పట్టారని బాబు వారికి వివరించారని చెబుతున్నారు. ఏపీలో అన్ని వర్గాల ప్రజలలో ప్రస్తుత ప్రభుత్వం మీద కసి కనిపిస్తోందని తెలుగుదేశం అధికారంలోకి రావాలని వారు బలంగా కోరుకుంటున్నారని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.

బాబు తనదైన శైలిలో తన మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్ ని ఉపయోగించారని అంటున్నారు. జాతీయ మీడియాలో ఏపీ గురించి జగన్ సర్కార్ గురించి వ్యతిరేకంగా వార్తలు రావడంతో పాటు వచ్చేది టీడీపీయే అని కచ్చితంగా రాస్తూ ప్రొజెక్ట్ చేస్తే అది బీజేపీ పెద్దల దృష్టిలో పడుతుందని దాంతో తెలుగుదేశం ప్రాధాన్యత కూడా తెలిసివస్తుందని బాబు స్కెచ్ గీశారని అంటున్నారు. బీజేపీ పెద్దలలో వైసీపీ మరో మారు అధికారంలోకి వస్తుంది అన్న అంచనాలు ఉంటే వాటిని తుడిచి పెట్టేల తెలుగుదేశం గురించి జాతీయ మీడియాలో ఫోకస్ అయ్యేలా బాబు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.

అంతే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న ఇతర విపక్షాలకు  కూడా టీడీపీ రాజకీయ వెలుగులు తెలియచేయడం ద్వారా మరో మారు తనను తాను నేషనల్ లెవెల్ లో ప్రొజెక్ట్ చేసుకోవడం కూడా బాబు మార్క్ పాలిటిక్స్ అంటున్నారు. మొత్తానికి సీఎం జగన్ ఢిల్లీ ఇలా వెళ్ళి అలా తిరుగు ఫ్లైట్ లో వస్తే బాబు మాత్రం హస్తినలోనే ఉంటూ రాజకీయ మంత్రాంగాన్ని నడుపుతున్నారని అంటున్నారు.

మరి జాతీయ స్థాయిలో జగన్ వ్యతిరేక కధనాలు వస్తే అది ఎంతవరకూ వైసీపీకి డ్యామేజ్ చేస్తుంది. కేంద్ర పెద్దల స్థాయిలో ఏ మేరకు ఆయన పరపతి తగ్గుతుంది అన్నది రానున్న రోజుల్లో చూడాల్సిందే. మరి దీనికి కౌంటర్ స్ట్రాటజీ ఏదైనా వైసీపీ వద్ద ఉందా అన్నది కూడా చూడాలని అంటున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.