సీఎంను అసలు పేరుతో పిలిచారని కేసు - విన్నావా పవన్!

Thu Dec 05 2019 20:00:01 GMT+0530 (IST)

Chances to File Case On Pawan kalyan on about His Comments on Jagan

ఒకవైపు ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హుందాతనం తప్పిన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ తోనే ఉన్నారో ఏమో కానీ.. జనసేన అధిపతి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అందులో ఒకటి.. తను సీఎం జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా  గుర్తించను అంటూ పవన్ ప్రకటించడం. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న వ్యక్తి విషయంలో పవన్ కల్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.అయితే అది పవన్ కల్యాణ్ విచక్షణ రాహిత్యం. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉంటూ.. ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా గుర్తించను అంటూ వ్యాఖ్యానించడం పవన్ కల్యాణ్ లేకితనమే తప్ప మరోటి కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో విబేధాలు ఉండవచ్చు.. అయితే మరీ ఇలా మూర్ఖంగా మాట్లాడటం పవన్ కల్యాణ్ కే సాధ్యం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి మాటలతో పవన్ కల్యాణ్ ఎన్నాళ్లు రాజకీయాలు చేయగలరు? అనేవి కూడా సందేహాలే. మోడీ అంటే ఎంత పడకపోయినప్పటికీ కాంగ్రెస్ వాళ్లు ఆయను ప్రధానమంత్రే అని అంటారు. ఆ హోదాతోనే గౌరవిస్తారు. కానీ పవన్ తన ఉలిపికట్టె ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు.

ఆ సంగతలా ఉంటే.. ఏపీలో ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ఒక విషయాన్ని గుర్తించాలి. అదేమిటంటే.. యూపీలో ముఖ్యమంత్రిని అసలు పేరుతో పిలిచినందుకు ఒక ప్రతిపక్ష నేతపై కేసు  నమోదు అయ్యింది.

యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ కు అసలు పేరు వేరే ఉందనే సంగతి తెలిసిందే. ఆయన పేరు  అజయ్ సింగ్ బిస్తా. యోగిగా మారాకా ఆయన పేరు మార్చుకున్నారు. ఆ పేరుతో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయన అసలు పేరు కూడా చర్చలో ఉంటుంది. ఆ పేరును ప్రస్తావించారని - సీఎంను ఆ పేరుతో సంబోధించారని విపక్ష నేత ఒకరి మీద పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం - కేసు నమోదు చేయడం జరిగింది. అసలు పేరుతో సంబోధించడం నేరం ఏమీ కాకపోయినా.. కేసు పెట్టేశారు. ఈ లెక్కన పవన్ కల్యాణ్ ఏపీ సీఎంను ఉద్దేశించి పేలుతున్న అవాకులుచవాకులపై ఎన్ని కేసులు పెట్టవచ్చో!