సవాళ్లు మనకు అచ్చి రావటం లేదు తలసాని?

Mon Mar 01 2021 05:00:02 GMT+0530 (IST)

Challenges do not imprint on us Talasani?

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతుంది. అంతకు ముందు పుష్కర కాలం పాటు ప్రతిపక్షంలో ఉండటం.. సవాలచ్చ సందర్భాల్లో సవాలచ్చ మాటలు చెప్పిన పరిస్థితి. అప్పుడెప్పుడో చెప్పిన మాట.. చెప్పినోడికి గుర్తు ఉండకపోవచ్చు.. కానీ.. అలాంటి మాటల కోసం వెతికేటోళ్లకు యూట్యూబ్.. సోషల్ మీడియా సిద్ధంగా ఉంటుందన్న విషయం గులాబీ నేతలు మర్చిపోయినట్లుగా ఉంది.తమకు అచ్చి రాని సవాళ్లు.. శపధాల గురించి అదే పనిగా మాట్లాడి అడ్డంగా బుక్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. తాజాగా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటివేళ.. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ మాటను తెర మీదకు తీసుకొచ్చాయి విపక్షాలు. అలాంటి మాటలు తమ బాస్ కేసీఆర్ అస్సలు అనలేదని.. కావాలంటే చెక్ చేసుకోవాలంటున్నారు.

రాజకీయాల్లో ఇలాంటి మాటలు మామూలే. కానీ.. గులాబీ నేతలు మరికాస్త ముందుకు వెళ్లి.. ఫ్రూఫులు చూపిస్తే.. పోటీ నుంచి తప్పుకుంటామని.. పదవులకు రాజీనామా చేస్తామని సవాళ్లు.. శపధాలు చేస్తున్నారు. వారి నోటి నుంచి అలాంటి మాటలు వచ్చినంతనే.. గంటల వ్యవధిలోనే.. కౌంటర్ వీడియోలు సిద్ధమై వైరల్ అవుతున్నాయి. ఖమ్మం.. వరంగల్.. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పల్లా ఈ మధ్య ఆవేశానికి గురై.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ ఎప్పుడైనా అన్నట్లు ప్రూఫ్ చూపిస్తే.. తాను ఎన్నికలబరిలో నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.

తాజాగా.. ఆయన నోట వెంట మాట రాని విధంగా.. అప్పుట్లో కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటల వీడియోక్లిప్ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. మరి పోటీ నుంచి తప్పుకుంటావా పల్లా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది సరిపోదన్నట్లుగా మంత్రితలసాని మరో తలనొప్పిని పార్టీకి తెచ్చినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల వ్యవధిలో 1.33 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేసిందని.. అది అసత్యమని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

ఒకవేళ తన సవాల్ ను నిరూపించకపోతే ప్రతిపక్ష నేతలు రాజకీయసన్యాసానికి సిద్ధమా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఇలాంటివి తొందరపడి మాట అనేస్తే.. తర్వాతి రోజుల్లోఇబ్బంది అవుతుందని లోగుట్టుగా వాపోతున్నారు అధికార పార్టీ నేతలు. దుబ్బాకలో కానీ.. గ్రేటర్ ఎన్నికల్లో కానీ తమ పార్టీ నేతల నోటి నుంచి వచ్చిన మాటలే తమ కొంప ముంచాయని.. ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి ఆచితూచి మాట్లాడితే మంచిదని చెబుతున్నారు. సొంత పార్టీ నేతలే సవాళ్లు.. శపధాలు వద్దంటుంటే.. తలసాని.. పల్లా లాంటోళ్లకు ఎందుకు అర్థం కావట్లేదు?