Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగ అంటుకుందా?

By:  Tupaki Desk   |   20 Jan 2022 12:30 PM GMT
తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగ అంటుకుందా?
X
ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి నేతల మధ్య సఖ్యత లేక అసమ్మతి రాజేయడం శరాఘాతంగా మారింది. 2023లో కేసీఆర్ ను దించి అధికారంలోకి రావాలని కేంద్రం పెద్దలు యోచిస్తుంటే ఆ పార్టీ నేతలు మాత్రం ఆధిపత్య పోరుతో రహస్య సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఫుల్లుగా అండదండలు అందిస్తున్నా కూడా తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తెరపైకి వస్తున్నాయి. విభేదాలు పొడచూపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓ వర్గం రహస్య సమావేశాలు నిర్వహించడమే అందుకు కారణంగా చెప్పొచ్చు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టాక పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. బండి సారథ్యంలో పార్టీ జోరందుకుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలే ఇందుకు నిదర్శనం. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రధాన పోటీదారు బీజేపీనే అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలోని విభేదాలు భగ్గుమనడం చర్చనీయాంశంగా మారింది.

బండి సంజయ్ కు వ్యతిరేక వర్గం సీక్రెట్ మీటింగ్ పెట్టడం.. ఆ తర్వాత జిల్లాల వారీగానూ రహస్య సమావేశాలు నిర్వహించడం దుమారం రేపుతోంది. టీఆర్ఎస్ పై పైచేయి సాధించే దిశగా పార్టీ సాగుతున్న సమయంలో ఈ విభేదాలు రావడాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.

బండి సంజయ్ సొంత జిల్లా కరీంనగర్ నుంచే ఈ వ్యతిరేక వర్గం గళం ఎత్తడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. బీజేపీ సీనియర్ నేతలు పెట్టుకున్న రహస్య సమావేశానికి కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అర్జున్ రావు నాయకత్వం వహించారని బీజేపీలో ప్రచారం సాగుతోంది. ఈ మీటింగ్ కు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని సమాచారం.

ఈ అసమ్మతి నేతల వ్యవహారాన్ని తేల్చేందుకు ఇంద్రసేనా రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారని దీనిపై నివేదిక కూడా అందించాలని ఆదేశించారని తెలిసింది. మరోవైపు ఈ రహస్య సమావేశాలు నిర్వహించిన నాయకులందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని టాక్. దీంతో ఆ నాయకులంతా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలివారని సమాచారం.

ఈ రహస్యసమావేశాల్లో వరంగల్, నల్గొండ,నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, ఆదిలాబాద్ కు చెందిన నాయకులు కూడా పాల్గొన్నట్టు సమాచారం. దీంతోహైకమాండ్ సీరియస్ అయ్యి వారందరిపై సస్పెన్షన్ వేటు వేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీలో ఈ అసమ్మతి సెగ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.