కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు...రాజుకున్న కొత్త చిచ్చు...?

Sat Jan 29 2022 16:26:36 GMT+0530 (India Standard Time)

Center vs States  the new poke that erupted

రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేంద్రం పెత్తనం వద్దు అంటారు. తమకే అన్ని అధికారాలూ కావాలి అని వాదిస్తారు. సమాఖ్య భావన అపుడు గుర్తుంటుంది. అదే ఒకసారి కేంద్రంలో అడుగుపెట్టాక ఎవరికైనా  రాష్టాలను గుప్పిట పట్టడం ఎలా అన్న ఆలోచనలు వస్తాయేమో. ఇదంతా ఎందుకంటే ఇపుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను కత్తిరించే పనిలో ఉందని ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు.అదే టైమ్ లో తాము కేంద్ర పెత్తనాన్ని సహించేది లేదని కూడా ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. ఇంతకీ కొత్త వివాదం ఏంటి అంటే భలే చిత్రమైనది అని కూడా చెప్పుకోవాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఇలా దాదాపుగా ఆల్ ఇండియా సర్వీస్ క్యాడర్ కి చెందిన అధికార శాఖలు ముప్పయి దాకా ఉంటాయి. ఈ శాఖలకు చెందిన అధికారుల మీద పెత్తనం పూర్తిగా తమకే ఉండాలని కేంద్రం కోరుకుంటోంది.

అదే సమయంలో రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కేవలం నామమాత్రం కావాలని కూడా ఆశిస్తోంది. నిజానికి ఆల్ ఇండియా సర్వీస్ కి చెందిన వారు అంతా కేంద్ర రాష్ట్రాలలో రొటేషన్ పద్ధతిలో  పని చేయాల్సి ఉంటుంది. వారు శిక్షణ పొందిన తరువాత ముందు రాష్ట్రాలలో కనీసంగా పదేళ్లు పనిచేయాలి. ఆ మీదట వారు కేంద్ర సర్వీసుల్లో  పనిచేయవచ్చు. అవసరం అయినపుడు అక్కడా ఇక్కడా కూడా వారు రోటేషన్ పద్ధతి ప్రకారం పని చేస్తూంటారు.

ఇక కేంద్రానికి ఆల్ ఇండియా సర్వీస్ క్యాడర్ సేవలను కనీసంగా నలభై శాతం దాకా వాడుకోవచ్చు. ఇలా కేంద్రం అధికారులను డెప్యూటేషన్ పైన కూడా తీసుకోవచ్చు. ఆల్ ఇండియా క్యాడర్ ని రాష్ట్రాల నుంచి తీసుకునేముందు కేంద్రం రాష్ట్రాల అనుమతి కోరడం ఇంతవరకూ ఉన్న విధానం. దానికి రాష్ట్రాలు నో అబ్జక్షన్ సెర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక విధంగా ఇది రాష్ట్రాలకు సమాఖ్య వ్యవస్థలో ఉన్న అధికారం అన్న మాట.

సదరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారి తమకు కావాలి అన్నపుడు రాష్ట్రాలు అలా నో అని కూడా  చెప్పవచ్చు. అయితే ఇపుడు దీని మీద కేంద్రం సవరణలు తీసుకురావాలనుకుంటోంది. దాని ప్రకారం డెప్యుటేషన్  కోరుతూ  రాష్ట్రాలకు లేఖ రాసినపుడు వారి కేంద్రం నిర్దేశించిన టైమ్ లోగా తమ అభిప్రాయాన్ని చెప్పనట్లు అయితే దాన్ని కూడా అంగీకారంగా తీసుకుని ముందుకు ప్రొసీడ్ అయిపోవచ్చు అన్న మాట. అంటే ఒక విధంగా కేంద్రం ఎవరిని డెప్యుటేషన్ మీద తీసుకుందామనుకుంటే వారిని ఇక మీదట హ్యాపీగా  తీసుకుపోవచ్చు.

అయితే  కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాలలో వేరొక పార్టీ ఉన్న చోట్ల నో అబ్జెక్షన్ అంటూ డెప్యూటేషన్ కి పచ్చ జెండా ఊపడానికి ఆయా ముఖ్యమంత్రులు అడ్డు పుల్లలు వేస్తున్నారు. దాంతోనే కేంద్రం ఇలా సవరణలు తీసుకురావాల్సి వస్తోంది అంటున్నారు.

అదే విధంగా రాష్ట్రాలలో పనిచేసేందుకే  ఎక్కువ మంది ఐఏఎస్ క్యాడర్ ఆసక్తి చూపుతోందిట. అలాగే ఆల్ ఇండియా లెవెల్ లో పనిచేసే అధికారులు గత ఎనిమిదేళ్ళుగా ఎందుకో  సెంట్రల్ సర్వీస్ కిందకు వెళ్ళేందుకు మొగ్గు చూపడంలేదు. దాంతో కేంద్రం వద్ద పనిచేసే అధికారులకు కొరత ఏర్పడుతోంది. ఉదాహరణకు జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారుల కొరత ఎక్కువగా ఉంది. అలాగే డిప్యూటీ సెక్రటరీల సంఖ్య కూడా గతం కంటే కూడా తగ్గుతోంది.

దీంతో కేంద్రం ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ని సవరించి అయినా తమ వద్ద పనిచేసే క్యాడర్ ని పెంచుకోవాలనుకుంటోఅంది. దానికి రాష్ట్రాల అభిప్రాయలను కూడా సంబంధం లేకుండా పూర్తి అధికారాలను తమకే ఉండేలా సవరణలకు ప్రతిపాదిస్తోంది. ఈ మేరకు ఈ నెల 25లోగా రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణ శాఖ రాష్టాలకు తాజాగా కోరింది.

దీని మీద దేశంలోని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ కూడా మండిపడ్డాయి. తమ అధికారాలను తీసుకోవడానికే ఇదంతా అంటూ రాద్ధాంతం స్టార్ట్ చేశాయి. వరసబెట్టి తమిళనాడు కేరళ తెలంగాణాతో పాటు లేటెస్ట్ గా ఏపీ కూడా కేంద్రానికి ఈ సవరణలు వద్దు అంటూ లేఖ రాశాయి. కొందరు ముఖ్యమంత్రులు అయితే ఇది సమాఖ్య వ్యవస్థకే ముప్పు అని కూడా ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి. మొత్తానికి కేంద్రం వర్సెస్ రాష్ట్రాలుగా కొత్త చిచ్చు రాజుకుంది. మధ్యలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను పెడుతున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో.