Begin typing your search above and press return to search.

1,500 ఎకరాల్లో శ్మశానం... 50 లక్షలకుపైగా శవాలు ఖననం!

By:  Tupaki Desk   |   24 Nov 2021 3:30 AM GMT
1,500 ఎకరాల్లో శ్మశానం... 50 లక్షలకుపైగా శవాలు ఖననం!
X
మానవుని జీవితంలో పుట్టుక, మరణం అనేవి చాలా గొప్పవి. చనిపోయిన తర్వాత మనిషిని చాలామంది కాల్చుతారు. మరికొందరు పూడ్చి పెడతారు. ఇలా పూడ్చిపెట్టిన వారిని ఆరాధించేందుకు వారికి సమాధిని ఏర్పాటు చేస్తారు. ఇలా సమాధులను ఏర్పాటు చేయడానికి ప్రతీ గ్రామంలోను ఓ శ్మశానవాటిక తప్పకుండా ఉంటుంది. రాజు, పేద అనే భేదం లేకుండా ఈ శ్మశానవాటికల్లో అందరికీ ఎంతో కొంత స్థలం ఉంటుంది. ఉన్న వారైనా.. లేని వారైనా.. అందులోని ఆరడుగులు ఉండే గుంతలో చివరకు శాశ్వతంగా నిద్ర పోవాల్సిందే. అదే ఈ ఆఖరి మజిలీ గొప్పతనం. జీవితాంతం ఎంత కష్టపడినా ప్రశాంతంగా ఉండేది శ్మశానంలోనే అని చాలా మంది తాత్వికంగా ఆలోచించే వారు చెప్తుంటారు.

ఇదిలా ఉంటే.. శ్మశానవాటిక అనేది ప్రతి గ్రామంలో వేరు వేరు పేర్లతో మనం చూస్తాము. అయితే ఇవి మహా అంటే రెండూ లేదంటే మూడు ఎకరాల్లో ఉండొచ్చు. అందులోనే ఊరి జనం అంత్యక్రియలను నిర్వహిస్తుంటారు. అయితే ఇరాక్ లోని ఓ శ్మశానవాటిక మాత్రం సుమారు 1500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ఇప్పటివరకు సుమారు 50లక్షలకు పైగా మందిని సమాధి చేశారు. ఈ శ్మశానవాటిక పేరే 'వాడీ ఉల్ సలామ్'.

వాడీ ఉల్ సలామ్ అనే ఈ శ్మశానవాటికకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఉండే అన్నీ శ్మశానవాటికలతో పోల్చితే ఇది చాలా పురాతనమైంది. ఇందులో లక్షల మంది సమాధులు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది ముస్లింలు. స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఈ శ్మశానం వాటికలో 24 గంటల సమయంలో కనీసం 200 మందిని ఇక్కడ ఖననం చేస్తారు. వీరిలో ఎక్కువ మంది షియా ముస్లింలు కావడం విశేషం. భూమి మీద ఉండే ఈ వర్గం ముస్లింలు చనిపోయిన తరువాత ఈ శ్మశానంలో ఖననం చేయమని వారి కుటుంబ సభ్యులకు చెప్తారంట. ఎందుకంటే వారి ఈ శ్మశానవాటిక చాలా ప్రత్యేకమైంది.

ఈ శ్మశానవాటికలో సుమారు 1,400 ఏళ్ల నుంచి 50 లక్షలకు పైగా మందిని ఖననం చేశారు. ఇందులో ఉన్న ఎక్కువ సమాధులు ఇరాక్ తో ఇరాన్ యుద్ధం చేసినప్పుడు మరణించిన వారివే. ఆ యుద్ధం ఎంతో మంది చనిపోయారు. రోజుకు కనీసం 100 నుంచి 250 మందిని ఆ సయమంలో ఖననం చేసేవారని స్థానికులు చెబుతున్నారు. అంతేగాకుండా ఈ శ్మశానం చాలా పెద్దగా ఉండడం వల్ల కొద్ది రోజులు ఉగ్రవాదులకు స్థావరంగా మారింది. దీంతో ఇరాక్ సైన్యం వారిపై మెరుపు దాడులు చేసింది. అక్కడ ఉన్న సమాధులు చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ మనం చూడవచ్చని స్థానికులు చెప్తున్నారు.ఇలా 'వాడీ ఉల్ సలామ్' తన పేరు మీద ఓ ప్రత్యేక అధ్యాయాన్నే లిఖించుకుంది. చరిత్రలో తన కంటూ కొన్ని పేజీలను పొందుపరుచుకుంది.