మూడు రోజుల పర్యటన దానికోసమేనా ?

Tue Feb 23 2021 13:00:02 GMT+0530 (IST)

Cbn Visit In Kuppam

ఈనెలాఖరులో చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించబోతున్నారు. 25 26 27 తేదీలల్లో కుప్పం నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయితీల్లోని 74 పంచాయితీల్లో వైసీపీ మద్దుతుదారులు ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ వైసీపీ ఘన విజయం కన్నా టీడీపీ ఘోర పరాజయమే అందరినీ ఆశ్చర్యపరిచింది.కుప్పంలో టీడీపీ పరిస్దితి ఇంత ఘోరంగా ఉందా అనే విషయం మొదటిసారి బయటపడింది. ఏదో లేస్తే మనిషిని కానంటూ పార్టీ నేతలు దశాబ్దాలుగా నెట్టుకొచ్చేస్తున్నారు. తీరా గట్టి ప్రత్యర్ధి ఎదురయ్యేటప్పటికి చతికిలపడ్డారు. ఇదే విషయం చంద్రబాబును బాగా కలవరపరిచినట్లుంది. దాంతో ప్రజాస్వామ్యం ఓడిందంటు ఏవేవో మాట్లాడినా అదంతా ఉపయోగం లేని ప్రకటనలే అన్న విషయం అందరికీ తెలిసిందే.

సరే విషయం ఏదైనా పంచాయితి ఫలితాల దెబ్బకు చంద్రబాబు హఠాత్తుగా మేల్కొన్నారనే చెప్పాలి. లేకపోతే ఇంత హఠాత్తుగా కుప్పం పర్యటన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇపుడు చేయబోయే పర్యటనేమో పంచాయితీ ఎన్నికలకు ముందే పెట్టుకునుంటే ఏదైనా ఉపయోగం కనిపించేదేమో.  ఈ నెలాఖరులో చంద్రబాబు పర్యటన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది.

పంచాయితి ఎన్నికల్లో తగిలిన దెబ్బకు బహుశా తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అయినా పార్టీని రెడీ చేద్దామని అనుకుంటున్నట్లున్నారు. కానీ అది జరిగేపనికాదు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుకు వైసీపీ పకడ్బందీ ప్రణాళికలను అమలు చేస్తోంది. కాబట్టి పంచాయితి ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిపీటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. సరే ఏదైనా ప్రయత్నం చేయటంలో తప్పు లేదు కాబట్టి చంద్రబాబు మూడు రోజుల పర్యటన పెట్టుకున్నట్లున్నారు.