కాపులేంటో అక్కడ చూపిస్తారట...?

Tue Jan 25 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Caste Politics In Andhrapradesh

ఏపీలో వేడి మామూలుగా లేదు. ఇంకా శీతాకాలం నడుస్తోంది కానీ వేసవి వేడి అయితే రాజకీయాల్లోకి వచ్చేసింది. కొత్త ఏడాది వస్తూనే వైసీపీ సర్కార్ కి కొత్త చిక్కులు తెచ్చేసేలా ఉంది. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు సౌండ్ చేశారు. పీయార్సీ విషయంలో వారు సమ్మె బాట పట్టారు. మరో వైపు సామాజిక సమీకరణలు కూడా వేగంగా మారుతున్నాయి. ఏపీలో కాపులు ఒక్కటి అవుతున్నారు. ప్రాంతాలు పార్టీలు అన్న తేడా లేకుండా వారంతా ఒకే వేదిక మీదకు వస్తున్నారు.ఇది కీలకమైన పరిణామంగానే అంతా చూస్తున్నారు. తాజాగా కాపులంతా వర్చువల్ గానే సమావేశమై అనేక అంశాలు చర్చించారు. పదమూడు జిల్లాలకు చెందిన కాపు నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అంతా ఈ వర్చువల్ భేటీలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక విషయం అయితే స్పష్టం అయింది. వైసీపీ సర్కార్ లో కాపులకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదని కాపు నేతలు పెదవి విరుస్తున్నారుట. కాపు కార్పోరేషన్ ద్వారా కూడా ఏ ఒక్క పధకం అమలు కావడం లేదు అని ఆవేదన చెందుతున్నారు.

మరో వైపు కాపుల సంక్షేమం కూడా కుంటుపడింది అని కాపు నేతలు భావిస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే కాపులు రాజకీయంగా సామాజికంగా ఆర్ధికంగా కూడా బాగా తగ్గిపోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా కాపులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇలా ఉపేక్షిస్తే లాభం లేదని కూడా వారు తలపోస్తున్నారు. అందుకే కాపులంతా ఒక్క త్రాటి మీదకు వచ్చి రాష్ట్రంలో రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారుట. ఇది నిజంగా ఏపీ రాజకీయాల్లో కీలకమైన అభిప్రాయామే అంటున్నారు. మరో వైపు చూస్తే వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో విజయవాడలో కాపులంతా ప్రత్యక్షంగా కలసి అన్ని అంశాలూ కూలంకషంగా చర్చించాలని  కూడా తీర్మానించారు అంటున్నారు.

ఇవన్నీ బాగానే ఉన్నా కాపులకు ఐకాన్ లాంటి ముద్రగడ పద్మనాభం లేకుండా కాపులంతా ఒక వేదిక ఏర్పాటు చేసినా దానికి పూర్తి ఫోకస్ వస్తుందా అన్న చర్చ అయితే ఉంది. అయితే ఆయన్ని కూడా కలుపుకుని పోయే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి విజయవాడలో కాపుల మహా  కలయిక అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో రీ సౌండే అని అంటున్నారు. దీని తరువాత పరిణామాలు కూడా వేగంగా మారిపోతాయని చెబుతున్నారు.