Begin typing your search above and press return to search.

ట్రంప్ మీద ఉన్న కేసులేంటి? అరెస్టు అయ్యే అవకాశం ఏంత?

By:  Tupaki Desk   |   22 March 2023 3:00 PM GMT
ట్రంప్ మీద ఉన్న కేసులేంటి? అరెస్టు అయ్యే అవకాశం ఏంత?
X
ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించిన అత్యంత వివాదాస్పద అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ అన్న మాట ఇట్టే వచ్చేస్తుంది. మరే అమెరికా అధ్యక్షుడికి లేనన్ని వివాదాలు మాత్రమే కాదు.. ఎన్నికల్లో ఓటమి వేళ.. ఆయన అనుచర వర్గం క్రియేట్ చేసిన రచ్చ.. అమెరికా చరిత్రలోనే షాకింగ్ పరిణామాల్లో ఒకటిగా చెప్పక తప్పదు. రిపబ్లికన్లకు ప్రతినిధ్యం వహించే ట్రంప్ అంటే.. సొంత పార్టీకి చెందిన పలువురునేతలకు సుతారమూ నచ్చదు. అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన నాయకత్వాన్ని రిపబ్లికన్ పార్టీ నేతలు పలువురు ఇష్టపడేవారు కాదు.

అలాంటి ట్రంప్ తాజాగా అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు. ఇంతకూ ఆయన మీద ఉన్న ఆరోపణ ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..ట్రంప్ మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. అయితే.. ఒక కేసులో మాత్రం ఆయన్ను అరెస్టు ముప్పు వెంటాడుతోంది. ఇంతకీ ఆ కేసేంటి? దాని పర్యవసానాలు ఏమిటి? నిజంగానే అరెస్టు అవుతారా? అరెస్టు అయితే ఏం జరుగుతుంది? మాజీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన ఒక క్రిమినల్ కేసులో అరెస్టుఅయితే.. మళ్లీ అధ్యక్ష పదవిని చేపట్టే వీలుందా? లాంటి ప్రశ్నలు బోలెడన్ని వెంటాడుతున్నాయి. మరేం జరుగుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. ఆ వివరాల్లోకి వెళితే..

తాజా కేసుకు ముందు అసలు ట్రంప్ మీద పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు తెలిస్తే.. ఆయన తీరు ఏమిటన్నదానిపై మరింత అవగాహన పెరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం ట్రంప్ ఎదుర్కొంటున్న ఇతర కేసుల్నిచూస్తే.. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రహస్య పత్రాల్ని ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ కు తీసుకెళ్లారన్న కేసు.. కాపిటల్ దాడుల కు సంబంధించిన కేసు.. 2020 అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసేలా ట్రంప్.. అతని అనుచరులు వ్యవహరించిన తీరుపై నమోదైన కేసులు ఉన్నాయి.

ఇంతకీ ట్రంప్ మీద ఉన్నలైంగిక వేధింపుల కేసేంటి? అన్న విషయంలోకి వెళితే.. 2006లో (దాదాపు 17 ఏళ్ల క్రితం) ట్రంప్ తనతో లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నారని పోర్న్ సినిమాల్లో నటించే స్టర్మీ డేనియల్స్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఎక్కడా వెల్లడించొద్దంటూ 2016లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే వేళలో భారీగా డబ్బులు ఇచ్చి నోరెత్తకుండా చేశారన్నది ప్రధాన ఆరోపణ. ట్రంప్ నిర్వహించే రియాల్టీ షో 'ది అప్రెంటీస్' లో ఛాన్సు ఇస్తానన్న ఆశ కల్పించి తనతో గడిపినట్లుగాసదరు నటి ఆరోపించారు. తనకు ఫోన్ చేసి హనీ బంచ్ అంటూ ముద్దుగా పిలిచేవారన్న ఆమె.. అధ్యక్ష ఎన్నికల్లో తాను నోరెత్తకుండా ఉండేందుకు 1.30 లక్షల డాలర్లు తనకు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.

ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి.. రహస్యంగా విచారణ జరుపుతున్నారు. కోర్టులో కేసు విచారణ తుది దశకు వచ్చింది. ఇలాంటి వేళలో ట్రంప్ ఈ మధ్యన మాట్లాడుతూ తనను అరెస్టు చేస్తారన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. దీంతో.. కలకలం రేగుతోంది. ఈ వ్యవహారంలో ఆరోపణలపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ఆధారాలన్నీ సేకరించినట్లుగా చెబుతున్నారు. ట్రంప్ నకు వ్యతిరేకంగా ఆయన మాజీ లాయర్ కోహెన్ సాక్ష్యం ఇచ్చారు (పోర్న్ నటికి డబ్బులు ఇచ్చిన ఉదంతంలో అతడి పాత్ర ఉంది). ఇదిలా ఉంటే.. మరో లీగల్ అడ్వైజర్ గా ఉన్న రాబర్ట్ ట్రంప్ కు వ్యతిరేకంగా జ్యూరీలో మాట్లాడి ఇప్పుడు ఆయనకు అనుకూలంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే కోర్టుకు ట్రంప్ హాజరు కాకూడదని నిర్ణయించుకోవటంతో విచారణ ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో ఏం చేయాలన్నది ప్రశ్నగా మారింది. దీంతో.. గ్రాండ్ జ్యూరీ ఏం చేస్తుందన్నది ప్రశ్న. ఎందుకంటే.. గ్రాండ్ జ్యూరీకి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నేరాభియోగం మాత్రమే చేయగలదు తప్పించి.. దోషి.. లేదంటే నిర్దోషి లాంటి అంశాల్ని తేల్చే అధికారం దానికి ఉండదు. అయితే.. ఆరోపణలు నిజమయ్యేలా ఆధారాలు ఉంటే నిందితుడ్ని అరెస్టు చేసి క్రిమినల్ కేసును నమోదు చేసే వీలుంది.

అదే జరిగితే క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న మొదటి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ మీద శాశ్వితంగా మరక పడుతుంది. తాజాగా ఆయన మీద అభియోగం నమోదైతే ట్రంప్ కు నాలుగేళ్ల వరకు జైలుశిక్షపడే వీలుంది. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెబుతున్న ట్రంప్.. మరి నేరారోపణ ఎదురై దోషిగా తేలిన తర్వాత జైలులో ఉన్న వేళలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా? అంటే చేయొచ్చని చెబుతున్నారు.

అదెలానంటే.. జైలు శిక్ష అనుభవిస్తూ అధ్యక్షుడు అయ్యే అవకాశం అభ్యర్థికి ఉండటమే దీనికి కారణం. దేశాధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థికి నేర చరిత్ర.. జైలు జీవితం లాంటి అంశాలేవీ అమెరికా రాజ్యాంగంలో పేర్కొనకపోవటమే దీనికి కారణం. సాంకేతికంగా ఆయన పోటీ చేసే వీలున్నా.. నైతికంగా ఆయన అభ్యర్థిత్వంపై అవకాశాల్ని దెబ్బ తీసే వీలుంది.

మరి.. ట్రంప్ అరెస్టు అయితే దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆయన అనుచరులు ఎలాంటి ఆందోళనలు చేపడతారు? క్యాపిటల్ దాడుల్ని తలపించేలా పరిణామాలు చోటు చేసుకుంటాయా? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఎన్నికల్లో అక్రమాలు జరగటం వల్లే తాను ఓడినట్లుగాట్రంప్ అనుకోవటం.. దీనికి తగ్గట్లే ఆయన అనుచరులు అమెరికా కాపిటల్ భవనం మీదకు దాడి చేయటం.. తీవ్రమైన హింసాకాండతో అట్టుడికిపోవటం తెలిసిందే. దీంతో.. తాజాగా అరెస్టు అయితే పరిస్థితి మరెలా ఉంటుందన్నది ఇప్పుడు సందేహంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.