కోడెల కుమార్తెపై మరో కేసు!

Wed Jun 12 2019 10:38:08 GMT+0530 (IST)

అధికారం చేతిలో ఉంటే నేతలు తమ హవా నడుపుతారని తెలుసు కానీ.. మరీ ఇంత దారుణంగానా? అన్న ప్రశ్న కే ట్యాక్స్ ఎపిసోడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో మెదులుతోంది. గౌరవనీయ స్థానాల్లో ఉండి మరీ ఇంతలా దిగజారిపోవటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే పలు కేసులు నమోదైన కోడెల ఫ్యామిలీపై తాజాగా ఆయన కుమార్తె విజయలక్ష్మీపై మరో కేసు నమోదైంది.నరసరావుపేటలోని ఒక లేఔట్ అనుమతి కోసం రూ.15లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగినట్లుగా ఒక బాధితుడు బయటకు వచ్చారు. తాజాగా పోలీసులను అప్రోచ్ అయిన ఆయన.. తనకు జరిగిన నష్టాన్ని పోలీసులు వివరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కోటిరెడ్డి.. తనను ఒక లేఔట్ అనుమతి ఇష్యూలో రూ.15లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లుగా వాపోయారు.

తొలుత రూ.10లక్షలకు సెటిల్ కాగా.. ఇప్పుడు మరో రూ.5లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నట్లుగా కోటిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. బెదిరింపులకు సంబంధించి కోడెల కుమార్తె మీద ఇప్పటికే ఒక కేసు నమోదైంది. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని విలువైన భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించిన వైనంపై ఇప్పటికే ఫిర్యాదు రావటం.. కేసు నమోదు కావటం తెలిసిందే. తాజాగా భూ యజమానుల్ని బెదిరింపులకుగురి చేసి కే ట్యాక్స్ పేరుతో రూ.25 లక్షల భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన తీరుతో పోలీసుల వద్దకు వెళ్లారు. కంప్లైంట్ ను ప్రాథమికంగా పరిశీలించిన పోలీసులు తాజాగా కోడెల కుమార్తె మీద మరో కేసు నమోదు చేయటం గమనార్హం.