ఒకే వేదికపై జగన్-కేసీఆర్.. ఎక్కడ? ఎందుకు? ఎలా?

Thu Sep 23 2021 23:00:01 GMT+0530 (IST)

Can we see KCR and YS Jagan together in Delhi

ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్మోహన్‌రెడ్డి కేసీఆర్‌లు.. ఒకే వేదికపై ఎక్కనున్నారా? ఇద్దరూ కలుసుకోనున్నారా?  దీనికిదేశ రాజధాని ఢిల్లీ వేదిక కానుందా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. దీనికి ప్రధాన కారణం.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో ఈ నెల 26న భేటీ కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి నక్సల్స్ ప్రభావం ఎలా తగ్గించాల నే అంశంపై  చర్చించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు .. కేంద్ర హోం శాఖ నుంచి ఆహ్వానాలు అందాయి.ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి శుక్రవారం ఢిల్లీకి పయనమవనున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.  వాస్తవానికి కేసీఆర్.. ఈ నెల 1 నుంచి దాదాపు వారం రోజులకు పైగానే.. ఢిల్లీలోనే ఉన్నారు. తొలుత ఢిల్లీలో టీఆర్ ఎస్ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అలాగే.. కేంద్ర హొం మంత్రి అమిత్‌షా తోనూ భేటీ అయ్యారు. అయితే.. ఇప్పుడు మరోసారి కేంద్ర హోం శాఖ ఆహ్వానం మేరకు కేసీఆర్ ఒకే నెలలో రెండోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.

అయితే.. ఈ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుందనే గుసగుస వినిపిస్తుండడం గమనార్హం. ఇక తెలంగాణతోపాటు.. ఏపీకూడా నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమే కావడంతో.. కేంద్ర హోం శాఖ ఏపీ ఒడిశా తదితర పది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించింది.  ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే.. ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఎలాగూ ఢిల్లీలో ఒకే వేదికపై కూర్చోనున్న నేపథ్యంలో ఇరువురూ.. కలిసి మాట్లాడుకుంటారా?  లేక.. చూపులతోనే పలకరించుకుని.. పక్కకు తప్పుకొంటారా? అనేది ఆసక్తిగా మారింది.

ఎందుకంటే.. ఆదిలో ఇద్దరూ స్నేహితులే అయినప్పటికీ.. జల వివాదాల నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు.. కూడా న్యాయపోరాటాలు.. కేంద్రానికి లేఖలు రాసుకుంటూ.. రాజకీయంగా కూడా వేడిపుట్టిస్తున్నారు. దీనిని బట్టి.. ఇప్పుడు ఢిల్లీలో నేరుగా ఇద్దరూ ఒకే సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో కలిసి కూర్చుని.. సమస్యలు పరిష్కరించుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా జల వివాదాలు చర్చించుకుని పరిష్కరించుకోమని.. సుప్రీం కోర్టు కూడా సూచించిన విషయం తెలిసిందే.

నిజానికి 2020 జనవరి తర్వాత.. జగన్ కేసీఆర్‌లు ముఖాముఖి కలుస్తున్నది ఇదే కావడం గమనార్హం. నిజానికి 2019లో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు.. స్వయంగా కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత.. కూడా పలుమార్లు .. ఇరువురు.. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి భోజనాలు చేశారు. దావత్‌లు ఇచ్చుకున్నారు. అయితే.. జనవరి 2020 నుంచి మాత్రం జల వివాదాలు తలెత్తిన తర్వాత.. నీటి కేటాయింపుల విషయంలో రగడ ప్రారంభమైన తర్వాత.. ఇరువురు ఎవరి దారిలో వారు నడుస్తున్నారు.  ఈ క్రమంలో ఇప్పుడు ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌లు.. అమిత్ షా సమావేశానికి ముందో.. తర్వాతో.. వ్యక్తిగతంగా కలుసుకుంటారా?  లేక.. ఎవరికివారుగా ముగించుకుని వెనక్కి వస్తారా? అనేది ఆసక్తిగా మారింది.