జాబితా రెడీ అయిందా... వైసీపీలో గుసగుస...!

Mon Jan 17 2022 17:36:08 GMT+0530 (IST)

Cabinet Expansion In Andhrapradesh

సంక్రాంతి అయిపోయింది. ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే.. గత ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో ప్రజలకు అనేక తిప్పలు వచ్చాయి. ప్రభుత్వాలు కూడా అనేక ఆంక్షలు విధించాయి. దీంతో సంక్రాంతికి దూరమయ్యారు. అయితే.. ఈ ఏడాది మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్నా.. దీనివల్ల ప్రాణ నష్టం లేక పోవడంతో ప్రజలు.. ఒకింత సాహసం చేసి.. సంక్రాంతిని ఆనందంగా చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఎటొచ్చీ.. అధికార పార్టీ నేతలకే సంక్రాంతి లేకుండా పోయిందట. నిజమే. అదేంటి?  అధికార పార్టీలో ఉన్నారు.. చేతిలో సొమ్ములు వున్నాయి... ఇక సంక్రాంతి లేక పోవడం ఏంటి ? అని అంటున్నారా ? ఇక్కడే ఉంది విషయం.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా.. వైసీపీ నేతలు కొందరు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మరికొందరు మాత్రం సంబరాలకు దూరంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం.. మంత్రి వర్గ విస్తరణ. గత రెండు నెలల కిందట.. మంత్రి వర్గ మార్పు ఉంటుందని.. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి బొత్స సత్యనారాయ ణ ఆళ్ల నాని వరకు అందరూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కొందరు కీలక నేతలు.. సంక్రాంతికి జాబితా ప్రకటిస్తారని కూడా అన్నారు.

దీంతో నేతలు ముఖ్యంగా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారు.. తమకు ఖచ్చితంగా సీటు దక్కుతుందని భావించిన వారు.. ఈ సంక్రాంతి కోసం.. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన మాట వాస్తవమే! దీంతో సంక్రాంతి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం నివాసంలో జరిగిన సంబరాలను నేరుగా కొందరు వీక్షిస్తే.. మరికొందరు టీవీలకు అతుక్కుపోయారు. అదే సమయంలో కొందరు సీనియర్లతో ఫోన్లలో మాట్లాడడంలో బిజీ అయ్యారు.

దీనికి కారణం.. మంత్రి వర్గం విస్తరణకు సంబంధించి సీఎం జగన్ జాబితా ప్రకటిస్తారనే ఆశే..! అయితే.. సీఎం అసలు ఈ ఊసు ఎత్తలేదు. సంబరాలు చేసుకుని ఇంటికే పరిమితమయ్యారు. దీంతో సీనియర్లకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. జాబితా రెడీ అయిందా లేదా?  ఎప్పుడు ప్రకటిస్తారు?  సాయంత్రం అవకాశం ఉందా? అనే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. అయితే.. దీనికి సీనియర్ల నుంచి కూడా ఎలాంటి సమాధానం రాకపోవడంతో నేతలు ఊసూరు మంటూ.. ఇంటికే పరిమితమయ్యారు.