Begin typing your search above and press return to search.

అందరి నోళ్లు మూయించిన జగన్!

By:  Tupaki Desk   |   26 Sep 2021 5:30 AM GMT
అందరి నోళ్లు మూయించిన జగన్!
X
సీఎస్ ఆదిత్యనాథ్ పదవీకాలం ఈ నెలతో ముగుస్తుంది. ఇప్పుడు అందరూ ఆయన సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుటుందా? లేక ఆయనను ఇంటికి పంపుతారనే అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. ముగ్గురు సీఎంల వద్ద పనిచేసి.. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆధిత్యనాథ్‌‌ను ప్రభుత్వం ఎందుకు పాధ్యాన్యత ఇవ్వడం లేదు? మాజీ సీఎం వైఎస్‌ఆర్, ప్రస్తుత సీఎంలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇద్దరు సీఎంల వద్ద నీటి పారుదల శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సీఎస్‌ను ఎందుకు ప్రభుత్వం వదులుకుంటోంది? ఇలా అనేక అనుమానాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.


సీఎస్ ఆదిత్యనాథ్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన సీఎస్‌గా ఈ నెల 30 వరకు బాధ్యతల్లో ఉంటారు. పదవీ విమరణ అనంతరం సీఎం ముఖ్య సలహాదారుగా సేవలందిస్తారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌నుంచి ఆయన విధులను నిర్వర్తిస్తారు. అయితే ఏ విధులు నిర్వహిస్తారనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. గతంలో సీఎస్ ఆదిత్యనాథ్ పదవికాలాన్ని పొడగించారు. మూడు నెలల పదవీకాలం ఈ 30తో ముగుస్తుంది. ఇప్పటికే ఈ స్థానంలో కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మను నియమించారు. రాష్ట్రంతో ఆదిత్యనాథ్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. అందువల్ల ఆయన సేవలను వినియోగించుకునేందుకే ప్రభుత్వ సలహాదారుగా నియమించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. ఆదిత్యనాథ్ నీటిపారుదల వ్యవహారాలను పర్యవేక్షించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ నుంచి ఆయన తప్పించారు. మరో అధికారి శశిభూషణ్‌ను నీటిపారుదల శాఖ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అందువల్ల నీటిపారుదల శాఖలో అనుభవం ఉన్న ఆధిత్యనాథ్‌కు తిరిగి నీటి పారుదల శాఖలో కీలక బాధ్యతలు అప్పగించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సీఎస్‌గా పనిచేసిన నీలం సాహ్నికి కూడా పదవీకాలం ముగిసిన తర్వాత ఎస్‌ఈసీగా నియమించింది. ఇప్పుడు ఆధిత్యనాథ్‌కు ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. అంతేకాదు జగన్‌కు సీఎస్ ఆధిత్యనాథ్‌పై నమ్మకంతోనే ఆయన సేవలను వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారని సీఎం వర్గాలు చెబుతున్నాయి.

ఆదిత్యనాథ్ పదవీకాలం ముగియకముందే కొత్త సీఎస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిందని, ఇలా చేయడం ఆదిత్యనాథ్‌ను అవమానించినట్లేనని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రతిపక్షాలకు సమాధానంగా సీఎస్‌ను ప్రభుత్వ సలహాదారుగా నిమయించి అందరి నోళ్లు సీఎం జగన్ మూయించారని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కృషి చేస్తోందని, ఆదిత్యనాథ్ సేవలు ప్రభుత్వానికి అవసరమని, సుదీర్ఘ అనుభవం గడిచించిన సీఎస్‌‌కు కీలక బాధ్యతలు అప్పగించారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. పోలరవం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రంతో సత్సబంధాలను మెరుగుపరుచుకునే విషయంలో ఆదిత్యనాథ్ కీలకంగా వ్యవహరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.