Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ రాజీనామా చేయాలి: క‌మ్యూనిస్టుల క‌న్నెర్ర‌!

By:  Tupaki Desk   |   30 May 2023 7:00 AM GMT
జ‌గ‌న్ రాజీనామా చేయాలి: క‌మ్యూనిస్టుల క‌న్నెర్ర‌!
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌పై క‌మ్యూనిస్టులు క‌న్నెర్ర చేశారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని.. తాను ఏం తప్పూ చేయలేదు అని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సీబీఐ, కోర్టుల విషయాలు జగన్కు వ్యతిరేకంగా వచ్చినప్పు డు.. తనను కాపాడమని ఢిల్లీకి వెళ్తారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఢిల్లీకి వెళ్లింది కూడా అందుకే అని.. సీబీఐ నుంచి, కేసుల నుంచి రక్షించమని కోరడానికే అని విమర్శించారు.

అవినాష్ రెడ్డి సంఘటనతో సీబీఐ తన పరువు తీసుకుందని సీపీఐ నారాయ‌ణ విమర్శించారు. సీబీఐ మీద ప్రజలకు నమ్మకం పోతోందని తెలిపారు. వివేకాను హత్య చేసింది ఎవరో తెలిసినా కూడా సీబీఐ ఎందుకు ఏం చేయలేకపోతోందని అన్నారు. అవినాష్ రెడ్డిపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ``అవినాష్‌రెడ్డి వ్య‌వ‌హారం-సీబీఐ అనుస‌రిస్తున్న వ్య‌వ‌హారం రెండూ కూడా పులి-మేక సామెత‌ను గుర్తు చేస్తున్నాయి. ఎందుకు ఇంత యాగీ చేస్తున్నారు. సీబీఐ అరెస్టు చేసేందుకు అవ‌కాశం ఇచ్చినా.. ఎందుకు చేయ‌డం లేదు`` అని నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

అస‌మ‌ర్థ సీఎం జ‌గ‌న్‌.. పాల‌న విష‌యంలో అస‌మ‌ర్థుడిగా ఉన్నాడు కానీ.. హ‌త్య‌ల నుంచి త‌న వారిని ర‌క్షించుకునేందుకు చాలానే త‌న మైండ్‌ను వినియోగిస్తున్నాడ‌ని నారాయ‌ణ దుయ్య‌బ‌ట్టారు. ఇందుకేనా.. ప్ర‌జ‌లు 151మంది ఎమ్మెల్యేల‌ను ఇచ్చింది? అని నిల‌దీశారు. ఇక‌, అదే విధంగా పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని నారాయ‌ణ‌ ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును.. ప్రధాని మోడీ అవమానించారని అన్నారు. దేశంలో రాజ్యంగాన్ని కేవ‌లం అద్దాల పెట్టెలో ప్ర‌ద‌ర్శ‌న కోసం ఉంచిన‌ట్టు ఉంద‌ని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వారు.. త‌మ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ప్ర‌జ‌లే తేల్చుకోవాల‌ని నారాయ‌ణ వ్యాఖ్యానించారు.