Begin typing your search above and press return to search.

ఆ మూడు జబ్బులకి ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదు : జగన్

By:  Tupaki Desk   |   18 Feb 2020 10:45 AM GMT
ఆ మూడు జబ్బులకి ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదు : జగన్
X
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీ అభివృద్దే ద్యేయంగా పలు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఇక క్రమంలోనే మంగళవారం కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ..ప్రతిపక్షాల పై సెటైర్లు వేశారు.

ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా ఉచితంగా వైద్యం చేయించే చికిత్స ఉంది.. కానీ.. అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదన్నారు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది..కానీ.. చెడు దృష్టికి మాత్రం ఎక్కడా చికిత్స లేనే లేదన్నారు. వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి.. కానీ.. మెదడు కుళ్లితే మాత్రం.. చికిత్సలు లేనే లేవు అని అన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న మనుషులను, మహాను భావులుగా చూపించే కొన్ని చానళ్లు, పత్రికలు ఉన్నాయన్న సీఎం జగన్.. వాళ్లను బాగు చేసే మందులు ప్రపంచంలో ఎక్కడా లేనే లేవు అని , ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను చూసి ఓర్చుకోలేని చంద్రబాబు కడుపు మండి పోతోందని విమర్శించారు.

ఇకపోతే , ఈ సమావేశంలో మాట్లాడుతూ ...వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం పై దృష్టిసారించామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాక ముందే మేనిఫెస్టోలో ఇచ్చిన 85 శాతం హామీలను అమలు చేశామని వివరించారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, ఇప్పుడు నాడు-నేడు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించబోతున్నామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఆస్పత్రులు కార్పొరేట్ హాస్పిటళ్లను తలదన్నేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. దీనికోసం రూ.15వేల 337 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలిపారు.

ప్రతీ ప్రభుత్వాసుపత్రిని ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్ట్స్ మేరకు మార్చుతామని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని.. మెడికల్ కాలేజీ రూపురేఖలను సముూలంగా మారుస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా కమ్యూనిటీ సెంటర్, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, మెడికల్ కాలేజీ.. ఇలా అన్నింటినీ మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయని జగన్ గుర్తుచేశారు. మరో 16 ఏర్పాటు చేస్తామని.. దీంతో మెడికల్ కాలేజీల సంఖ్య 27కి చేరుతుందన్నారు. మెడికల్ కాలేజీ లో ఎంబీబీఎస్ విద్యార్థులు, పీజీ చదివే స్టూడెంట్స్, వైద్యులు ఉంటారని చెప్పారు. దీంతో ఏదైనా వ్యాధి తో మెడికల్ కాలేజీ కి వస్తే సరైన చికిత్స అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని అవ్వ-తాతల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మూడో దశ కంటి వెలుగును శ్రీకారం చుట్టామని , నాడు-నేడుతో వైద్యం, కంటి వెలుగు రెండు పథకాలు కర్నూలు నుంచి ప్రారంభించామని తెలిపారు. జూలై 30వ తేదీ వరకు మూడో దశ కంటి వెలుగు పథకం అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 56 లక్షల 86 వేల 420 మందికి అవ్వ తాతలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. వైద్యులు పరీక్షించగా.. ఆపరేషన్ చేయాలని కోరితే మార్చి 1 తేదీ నుంచి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు.