Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   4 Dec 2022 1:30 PM GMT
సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ తీరుపై విరుచుకుపడ్డారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోడీ విధానామా? అంటూ నిలదీశారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తాను తెలంగాణ సాధించుకున్నామని.. అదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో ముందుకెళతామన్నారు. నేను మీతో ఉంటానని.. మీరు నాతో ఉండాలని.. మీరు హామీ ఇస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళతామని.. తెలంగాణ వలే భారత్ ను కూడా అభివృద్ధి చేసుకుందామని కేసీఆర్ అన్నారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ చురుకైన పాత్ర పోషించాలని కేసీఆర్ అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక హబ్ గా మారుతోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్కటే పూర్తి కావాల్సి ఉంది. ఈప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదన్నారు. సంక్షేమంలో మనకు ఎవరూసాటి లేరని.. ప్రతి వర్గానికి ఒక కార్యక్రమం చేపట్టి ఆదుకుంటున్నామన్నారు.

తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా బాగుపడుతుందని 20 ఏళ్ల క్రితమే చెప్పాను. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజలు తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. గతంలో రూ.50వేలు ఇచ్చే ఆపద్బంధు కోసం కాళ్లు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రైతు ఏ కారణంతో చనిపోయినా రైతు బీమా కింద రూ.5 లక్షలు వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు వైద్య కళాశాలలు వస్తాయని ఎప్పడైనా అనుకున్నామా? రాత్రింబవళ్లు కష్టపడితే తెలంగాణ రాష్ట్రం ఇంత ప్రగతి సాధించింది.. మేధావులు, చదువుకున్న యువత సరిగా ఆలోచించాలి.. ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు 3 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు చొప్పున త్వరలోనే మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

మోడీ సర్కార్ వల్ల తెలంగాణ రాష్ట్రం 3 లక్షల కోట్లు నష్టపోయిందని.. కేంద్రప్రభుత్వం సహకరించి ఉంటే తెలంగాణ జీఎస్డీపీ ఇంకా పెరిగి ఉండేదని.. కృష్ణా జలాల్లో వాటా తేల్చేందుకు మోడీకి ఎనిమిదేళ్లు కూడా సరిపోలేదా? వాటా తేల్చేందుకు 8 ఏళ్లు సరిపోకపోతే అనుమతులు ఇచ్చేది ఎప్పుడు? ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టిస్తున్నారు. దేశంలో ఏం జరుగుతుందో గ్రామాల్లో చర్చ జరగాలన్నారు. ప్రజలు, మేధావులు, యువత ఆలోచించాలి అని కేసీఆర్ ఆడిపోసుకున్నారు.

కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసీఆర్.. నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని మోడీయే అన్నారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోడీ విధానమా? బెంగాల్ లోనూ ఇలానే అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే ప్రజాస్వామ్య విధానమా? ,.. ఇలానే తెలంగాణ సర్కార్ ను కూల్చడానికి వచ్చిన వారిని జైల్లో పెట్టాం అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.