గవర్నర్ కు ఉన్న అధికారాలు పీకేయడానికి రెడీ అయిన కేసీఆర్?

Tue Jun 28 2022 06:00:02 GMT+0530 (India Standard Time)

CM KCR And Governor Tamilisai

యూనివర్సిటీలకు బాస్ గవర్నర్ తమిళిసై. ఏ పదవుల భర్తీ అయినా.. విధాన నిర్ణయాలైనా గవర్నర్ మాత్రమే చేస్తారు. వాటిల్లో అధికారం ఉండడంతో తెలంగాణ గవర్నర్ తమిళిసై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ నామినేట్ చేస్తే పక్కనపెట్టి తన ఇష్టానుసారం చేస్తున్నారు. దీంతో ఏకంగా గవర్నర్ కు అధికారాలు లేకుండా తమ ఇష్టానుసారం నియామకాలు విధుల కోసం కేసీఆర్ సర్కార్ స్కెచ్ గీసింది. గవర్నర్ కు యూనివర్సిటీలపై అధికారులను తీసేసి సీఎంకు కట్టబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది.యూనివర్సిటీల చట్ట సవరణకు సంబంధించి ముసాయిదా బిల్లు సిద్ధమైంది. విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీలో కొత్త విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఈ క్రమంలోనే యూనివర్సిటీల చట్టానికి సవరణ చేయాల్సి ఉంది. చట్ట సవరణకు సంబంధించిన ముసాయిను రూపొందించిన అధికారులు సీఎం కేసీఆర్ కోసం ఆమోదం కోసం పంపినట్లు తెలిసింది. వర్సిటీల్లో ఖాళీల భర్తీలో కొత్త విధానాన్ని అమలు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించి కామన్ బోర్డును ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం అసాధ్యం. ఎందుకంటే ఏ వర్సిటీ పరిధిలోని ఖాళీలను ఆ వర్సిటీయే సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కామన్ ఎంట్రన్స్ ద్వారా అన్ని యూనివర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలంటే చట్టానికి సవరణ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చట్ట సవరణ ముసాయిదాను సిద్ధం చేయగా.. దాన్ని ఇప్పటికే న్యాయశాఖ అధికారులు పరిశీలించినట్టు సమాచారం. తాజాగా సీఎం ఆమోదం కోసం పంపినట్లు తెలిసింది.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు. ఇలాంటి సందర్భాల్లో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణలను తీసుకొస్తారు. ఇలా చేయాలంటే ముసాయిదా బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో ఈ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపుతారా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. గవర్నర్ వద్దకు బిల్లు పంపొద్దని ప్రభుత్వం భావిస్తే శాసన సభను ప్రత్యేకంగా సమావేశపరచాల్సి ఉంటుంది.

మరోవైపు యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీ కోసం తెలంగాణ సర్కార్ ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వంలో కామన్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇందులో విద్యాశాఖలోని ఐఏఎస్ లు ఉంటారు. బోర్డు కార్యకలాపాలను ప్రారంభించాలంటే ముందుగా యూనివర్సిటీ చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. సవరణ అనంతరం పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత కామన్ బోర్డు ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది.

యూనివర్సిటీలకు కులపతి విషయంలో కూడా చట్ట సవరణ చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత చట్టం ప్రకారం యూనివర్సిటీలకు గవర్న్ కులపతిగా ఉంటారు. గవర్నర్ తో విభేదాల వల్ల  ఆమెకు అధికారాలు లేకుండా చట్ట సవరణ చేస్తున్నట్టు తెలుస్తోంది.