Begin typing your search above and press return to search.

ఇదేమి జగనా? ప్రత్యర్థుల మీదనే కాదు.. సొంతోళ్ల మీదా దాడులా?

By:  Tupaki Desk   |   15 Jan 2022 1:30 AM GMT
ఇదేమి జగనా? ప్రత్యర్థుల మీదనే కాదు.. సొంతోళ్ల మీదా దాడులా?
X
వైసీపీ నేతల తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రత్యర్థి పార్టీ నేతల మీదా.. తమకు ప్రత్యర్థులగా ఉన్న వారిపై రాజకీయ దాడులు.. ప్రతీకారాలు తీర్చుకున్న వైనాల్ని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పార్టీ అధినేత కమ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకింత జీర్ణించుకోవటానికి సైతం ఇబ్బంది పెట్టేలా మారాయన్న మాట వినిపిస్తోంది. తాజాగా.. జిల్లాలోని ప్రొద్దుటూరులో పార్టీ నేతల మధ్య నడుస్తున్న రచ్చ.. పార్టీ పరువును గంగపాలు చేసేలా మారిందంటున్నారు.

ఇంతకాలం పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారి మీద కత్తి కట్టిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీకి చెందిన నేతలు.. తమ కంటే బలోపేతం కావటాన్ని జీర్ణించుకోలేక దాడులకు తెగపడటం చూస్తే.. కంచె చేను మేస్తున్న తరహాలోకి పార్టీ ప్రయాణిస్తుందన్న సామెతను గుర్తు చేస్తున్నారు. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ లకు మధ్య నడిచే రాజకీయ శత్రుత్వం అందరికి తెలిసిందే.

తాజాగా ఎమ్మెల్సీ వర్గీయులపై ఎమ్మెల్యేవర్గీయులు దాడికి పాల్పడిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. గురువారం అర్థరాత్రి వేళ చోటు చేసుకున్న భౌతిక దాడులపై పార్టీ వర్గాలు షాక్ కుగురవుతున్నాయి. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఆర్వీ రమేశ్ పుట్టిన రోజుకావటంతో.. ఆయన అభిమానులు.. పార్టీ కార్యకర్తలు.. రమేశ్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రొద్దుటూరులో ఫ్లెక్సీలు కడుతున్నారు. దీన్ని ఎమ్మెల్యే వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రొద్దుటూరులో తనకు ప్రత్యామ్నాయ నాయకుడిగా రమేశ్ ఎక్కడ ఎదుగుతాడో అన్నట్లుగా ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.

అందుకే.. అవకాశం వచ్చిన ప్రతిసారీ తమ అధిపత్యాన్నిప్రదర్శించుకోవటానికి అస్సలు వెనుకాడటం లేదు. ఎమ్మెల్సీ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటో లేకపోవటాన్ని వెలెత్తి చూపిస్తున్నారు. ఇదే అంశాన్ని లెవనెత్తి గురువారం అర్థరాత్రి వేళ.. రమేశ్ వర్గీయులపై వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే వర్గీయులు.. అనంతరం దాడులకు తెగబడటాన్ని తప్పు పడుతున్నారు.

ఎమ్మెల్సీ రమేశ్ కు దన్నుగా నిలిచే రఘునాథ రెడ్డిపై ఎమ్మెల్యే వర్గీయులు దాడికి పాల్పడటం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. రఘునాథ రెడ్డి పేరుతో భారీగా ఫ్లెక్సీలు ప్రత్యక్ష కావటాన్ని ఎమ్మెల్యే వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నట్ుల చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఇల్లు కమ్ ఆఫీసు ఉన్న శ్రీరాములపేటలో శుక్రవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే వర్గీయులు ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ కు సంబంధించిన ఫ్లెక్సీల్ని చంచివేశారు. ఈ తీరుపై రమేశ్ యాదవ్ వర్గీయులు రగిలిపోతున్నారు.

తమ వర్గీయులపై దాడి చేయటంతో పాటు.. ఫ్లెక్సీల్ని చించి వేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చూస్తూ ఎమ్మెల్సీ వర్గీయులు ప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకాలం పార్టీలో రగులుతున్న విభేద జ్వాల తాజాగా బయటపడిన తీరు పార్టీకి మంచిది కాదని.. సొంతజిల్లాలో ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ మధ్య నెలకొన్న అధిపత్య పోరుకు చెక్ పెట్టాల్సిన బాధ్యతను జగన్ తీసుకోవాలంటున్నారు. లేదంటే.. పార్టీకి జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరి.. ముఖ్యమంత్రి జగన్ ఈ ఉదంతంపై ఎలా రియాక్టు అవుతారో చూడాలి.