Begin typing your search above and press return to search.

రామోజీకి భారీ షాక్ ఇచ్చిన జగన్...మున్ముందు సంచలనాలే...?

By:  Tupaki Desk   |   29 May 2023 11:19 PM GMT
రామోజీకి భారీ షాక్ ఇచ్చిన జగన్...మున్ముందు సంచలనాలే...?
X
ఇంతకాలం ఎదురులేదు అనుకున్న మీడియా మొఘల్ రామోజీరావుకు అతి పెద్ద షాక్ తగిలింది. అది జగన్ ప్రభుత్వం నాలుగేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో. రామోజీరావు అంటేనే రాజకీయ రంగంలోని వారు సైతం అలెర్ట్ గా ఉంటారు జాతీయ స్థాయిలో ఆయన పలుకుబడి అలాంటిది.

అటువంటి రామోజీరావుకు ఆయువుపట్టుగా ఉన్న మార్గదర్శి విషయంలోనే జగన్ గురి పెట్టారు. కుంభ స్థలం లాంటి మార్గదర్శిని కొట్టడం ద్వారా రామోజీరావును కూడా అందరిలాగానే ఏమైనా చేయవచ్చు అని జగన్ లోకానికి చాటారు. నిజానికి తాను చట్టానికి అతీతుణ్ణి అని రామోజీరావు భావిస్తూంటారని ప్రచారంలో ఉన్న మాట.

ప్రస్తుతం రామోజీరావు వయసు 87 ఏళ్ళు. ఆయన పత్రిక ఈనాడు వయసు వచ్చే ఏడాదికి యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది.మార్గదర్శి వయసు గత ఏడాదితో అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇవే కాదు, ముప్పయేళ్ళ ఈటీవీ ప్రస్థానం ఉంది. నాలుగు దశాబ్దాల ఉషా కిరణ్ మూవీస్ సినీ నిర్మాణం ఉంది. వీటన్నిటినీ మించి మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది.

ఇలా వేల కోట్ల సామ్రాజ్య అధినేతగా, దేశంలోని వ్యాపార దిగ్గజ నేతగా ఉన్న రామోజీరావు వైపు కనీసం చూసేందుకు కూడా ఎవరూ సాహసించేది లేదు. అలాంటి రామోజీరావు ఇంటికి రెండు నెలల క్రిత్రం ఏపీ సీఐడీ అధికారులను పంపించి ఆయన్ని విచారించినపుడే జగన్ పట్టుదల ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. రామోజీ సైతం ఇది కాల మహిమా జగన్ మహిమా అన్నట్లుగా ఒక వీడియో అయితే వైరల్ అయింది.

ఆ రోజున నడుముకు బెల్ట్ కట్టుకుని సెలైన్ బాటిల్స్ తో బెడ్ మీద ఉన్న రామోజీరావు బేలగా కనిపించారు. ఆ విధంగా వైసీపీ మాస్టర్ స్ట్రోక్ ఏంటో చూపించింది. ఇక దానితో పాటు మరింత దూకుడు పెంచి ఏపీలో మార్గదర్శికి ఉన్న 37 బ్రాంచీలను తనిఖీలు చేసి అక్కడ ఉన్న రికార్డులను కీలక సమాచారాన్ని మార్గదర్శి సిబ్బంది నుంచి సీఐడీ అధికారులు సొంతం చేసుకున్నారు. అందులో మార్గదర్శికి సంబంధించి పూర్తి సమాచారం అంతా ఉంది.

అంతే కాదు ఖాతాలు వాటి వివరాలు కూడా ఉన్నాయి. చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించిన తీరు కూడా అక్కడ నుంచే సీఐడీ అధికారులు సేకరించారు. పూర్తి ఆధారాలను దగ్గర ఉంచుకో కేసులు నమోదు చేశారు. ఆ మీదట కోర్టుకు రామోజీరావు వెళ్ళినా ఊరట లభించలేదు. ఈ నేపధ్యంలో మార్గదర్శిలో లొసుగులు ఏంటి అంటే అక్కడ మొత్తాలను తెచ్చి ఇతర సంస్థలలో పెట్టడం అతి పెద్ద నేరంగానే చూస్తున్నారు.

అంతే కాదు చిట్ ఫండ్స్ యాక్ట్ ప్రకారం ఏ బ్రాంచికి ఆ బ్రాంచిలోనే నగదు ఉంచి పాటదారుడికి సకాలంలో సొమ్ము చెల్లించాలి. కానీ అంత సొమ్మూ కేంద్రీకృతంగా ఒకే చోటకు వెళ్తున్నదీ గుర్తించారని అంటున్నారు. ఇక చిట్ ఫండ్స్ మొత్తాలను జాతీయ బ్యాంకులలోనే డిపాజిట్ చేయాలని రూల్ ఉంది.

ఇలా చాలా నిబంధనలు ఉంటే వాటిని మార్గదర్శి ఉల్లంఘించింది అని ఏపీ సీఐడీ అధికారులు గుర్తించే ఇపుడు ఆస్తులను అటాచ్ చేయడం దాకా వచ్చారు. దానికి వారు చెబుతున్న కారణం ఏంటి అంటే 793 కోట్ల రూపాయలు అటాచ్ చేశామని ఖాతాదారులు అడిగిన వెంటనే సొమ్ములు చెల్లించే స్థితిలో మార్గదర్శి లేదని అందుకే ఈ చర్య అని అంటున్నారు.

ఇదిలా ఉంటే మార్గదర్శి విషయంలో పూర్తి సమాచారం దగ్గర ఉంచుకునే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు సడెన్ గా ఏపీ సీఐడీ అధికారులు దూకుడు పెంచడం వెనక వ్యూహాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా మార్గదర్శి వంటి సంస్థ రామోజీరావు మొత్తం వ్యాపార సామ్రాజ్యానికి ఆయువు పట్టుగా చెబుతారు. అక్కడ ప్రతీ అయిదు నిముషాలకు చిట్ సాగుతూనే ఉంటుంది.

అలా వేల కోట్లలో టర్నోవర్ వచ్చే ఏకైన అతి పెద్ద ఆర్ధిక సంస్థ. దాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ పెద్దలు కదిపిన పావులు సరైన లక్ష్యాన్నే చేదించాయని అంటున్నారు. అదే విధంగా రామోజీరావు ఆర్ధిక సామ్రాజ్య విస్తరణ వెనక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సహాయకారిగా ఉన్నారని అంటున్నారు.

ఆయన అండతోనే ఈ రోజున రామోజీరావు ఇంతటి స్థాయిలో ఉన్నారని అంటున్నారు. ఇపుడు మార్గదర్శి కుంభకోణం వెనక కూడా చంద్రబాబు పాత్ర ఉందని అంటున్నారు. తెలుగుదేశానికి పూర్తి మద్దతుగా తన పత్రికను రామోజీరావు వినియోగించారని అంటున్నారు. అదే సమయంలో ఆయనకు టీడీపీ అండగా ఉంటూ వస్తోంది.

తెలుగుదేశానికి ఆర్ధిక వనరుల విషయంలో రామోజీరావు సంస్థల నుంచి అండదండలు ఉన్నాయని వైసీపీ భావిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల సమయానికి ఏపీ రాజకీయ తెర మీద టీడీపీకి రామోజీరావుకి మధ్య లింక్ ని ఫోకస్ చేసే ఎత్తుగడ కూడా ఇందులో ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం ఆర్ధిక మూలాలు, నైతిక మద్దతుకు కొండంత అండగా ఉన్న రామోజీరావు మీదనే శరసంధానం మొదలైంది.

ఇక ఇది ఇక్కడితో ఆగేది కాదని ముందు ముందు మరిన్ని సంచలన ఫలితాలు నమోదు అవుతాయని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. మొత్తానికి ఒక్క మాట చెప్పుకోవాలి. ఏపీలో రాజకీయాలకు మీడియాకు మధ్య పెనవేసుకునిపోయిన తెర వెనక ముందు బంధాలు వాటి ప్రభావాలు ఇపుడు ఇలా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఏ రంగమైనా హద్దులు దాటి వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయో రాజకీయమే చెబుతుంది.