Begin typing your search above and press return to search.

రోజుకో మలుపు.. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం మళ్లీ ఏం జరిగిందంటే..?

By:  Tupaki Desk   |   14 May 2022 11:11 AM GMT
రోజుకో మలుపు.. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం మళ్లీ ఏం జరిగిందంటే..?
X
ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ట్విట్టర్ ను కొనుగోలు చేసినట్లు ప్రకటించుకున్న ఎలన్ మస్క్... ఆ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. స్పామ్ ఖాతాలు, నకిలీ ఖాతాల లెక్కలు ఇంకా తనకు అందలేదని అందుకే ఒప్పందాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు.

ఎలన్ మస్క్ కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేయడం పై తాజాగా.. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందించారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం కచ్చితంగా పూర్తి అవుతుందని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ... ఇతర ఊహించని పరిణామాలకూ తాము సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ లో ఇద్దరు ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులను సీఈవో పరాగ్ అగర్వాల ఇటీవల తొలగించారు. మరో వైపు కొత్త నియామకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పరాగ్ చేపట్టిన ఈ చర్యలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాగూ కంపెనీ యాజమాన్యం మారుతున్నప్పుడు ఇంకా వ్యయ నియంత్రణ చర్యలెందుకని కొంత మంది తనని అడుగుతున్నారని పరాగ్ వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిశ్రమ చాలా సవాళ్లను ఎదుర్కొంటోందని... డీల్ ను అడ్డం పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండలేనని తెలిపారు పరాగ్. నేనే కాదు.. ట్విట్టర్ బాగు కోసం సంస్థలోని ఇతర నాయకులెవరూ అలాంటి ఆలోచన చేయబోరని వారికి సమాధానం ఇచ్చినట్లు పరాగ్ తెలిపారు.

44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను కొనుగోలు చేసే ఒప్పందాన్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ట్విట్టర్ లో స్పామ్, నకిలీ ఖాతాల సంఖ్య కచ్చితంగా ఎంత ఉందన్న విషయాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఖాతాల సంఖ్య ను కంపెనీ తక్కువగా చూపుతోందా అని ఆయన అడిగారు. ట్విట్టర్ రోజూ వారీ వినియోగదార్లలో 5 శాతం కంటే తక్కువే స్పామ్ లేదా తప్పుడు అకౌంట్లు ఉన్నట్లు తొలి త్రైమాసిక నివేదికలో అంచనా వేసినట్లు మస్క్ లింక్ షేర్ చేశారు.

అయితే మస్క్ చేసిన ఈ పని పై నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ డీల్ ను రద్దు చేసుకోవడం అంత సులభమైన అంశమేమీ కాదని నిపుణులు అంటున్నారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని ఒక వేళ ఎలాన్ మస్క్ రద్దు చేసుకున్నట్లైతే 1 బిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే న్యాయపరమైన చిక్కులు తప్పవని తెలిపారు. మొత్తంగా మస్క్ బిలియన్ డాలర్ల నష్టాన్ని భరించాల్సి ఉంటుందని అంచనా వేశారు.