Begin typing your search above and press return to search.

మీరంతా మాస్కులు కట్టుకోండి.. నేను మాత్రం కట్టుకోనన్న ట్రంప్

By:  Tupaki Desk   |   4 April 2020 10:50 AM GMT
మీరంతా మాస్కులు కట్టుకోండి.. నేను మాత్రం కట్టుకోనన్న ట్రంప్
X
ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లుగా వ్యవహరించటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు అలవాటే. ఆయన మాటలు.. చేతలు తరచూ వివాదాస్పదమవుతుంటాయి. ప్రజలందరిని ఏకతాటి మీద నడిపించే విషయంలో ఆయన ఇప్పటికే విఫలమయ్యారు. ప్రపంచం మొత్తం సంక్షోభంలో చిక్కుకున్న వేళలోనూ.. అమెరికా అంతలా ప్రభావితమైన సందర్భాలు చాలా చాలా తక్కువ. అందుకు భిన్నంగా కరోనా వైరస్.. అగ్రరాజ్యానికి చెమటలు పట్టించటమే కాదు.. చుక్కలు చూపిస్తోంది. అమెరికా లాంటి దేశంలో రెండు లక్షల మందికి పైగా ప్రజలు కరోనా బాధితులుగా మారగా.. ఏడు వేల మంది మరణించారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటివేళ.. దేశ ప్రజలకు సలహాలు.. సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు మాస్కుల్ని ధరించటం తప్పనిసరి అని చెప్పిన ట్రంప్.. అందుకు మెడికల్ మాస్కుల్ని మాత్రమే వాడాల్సిన అవసరం లేదని.. సాధారణ మాస్కులు.. చేతి రుమాళ్లు.. ఇంట్లో తయారు చేసిన మాస్కుల్ని ధరిస్తే సరిపోతుందన్నారు.

నిజానికి ఈ విషయంలో భారతీయులు చాలా మేలు. ఎప్పుడైతే మాస్కుల కొరత వచ్చిందో.. దాని గురించి అదే పనిగా ఆలోచించటం మానేసి.. జేబులో ఉండే జేబురుమాలను తీసుకొని ముఖానికి కట్టేసుకోవటం చూస్తున్నాం. ఇంత చిన్న విషయాన్ని తన ప్రజలకు అమెరికా అధ్యక్షుడు స్వయంగా చెప్పాల్సిన రావటం దేనికి నిదర్శనం? ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశ ప్రజలంతా ముఖానికి ఏదో ఒక మాస్కు కట్టుకోవాలని చెప్పిన ఆయన.. తాను మాత్రం ముఖానికి మాస్కు ధరించే ప్రసక్తే లేదని చెప్పటం గమనార్హం.

తాను మాస్కు ఎందుకు ధరించటం లేదన్న విషయానికి వివరణ ఇచ్చే కన్నా. .మాస్కు ధరించనన్న వాదనను వినిపించటం ద్వారా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేశారు. దేశాధ్యక్ష స్థానంలో ఉన్న వారు అందరికి మార్గదర్శకంగా నిలవాలి. సంక్షోభ సమయంలో అందరికి స్ఫూర్తిని ఇచ్చేలా చేయాలి. సామాజిక దూరం (కొందరు భౌతిక దూరం అని కూడా అంటున్నారు) పాటించాలని చెబుతున్న వేళ.. ప్రధాని మోడీ తాను చెప్పటమే కాదు.. ఆచరణలో చేసి చూపిస్తున్న వైనాన్ని ఫోటోల్ని చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. అలాంటిది తాను చెప్పినట్లు ప్రజలు పాటించాలని భావించే ట్రంప్.. తాను మాత్రం అలాంటివేమీ చేయనని చెప్పటంలో అర్థమేమిటి? ఇలాంటివేళలో ఈ మొండితనం ఏమిటో?