ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులకు ముందు సీబీఐ ట్విస్టు

Tue Jan 24 2023 10:32:30 GMT+0530 (India Standard Time)

CBI twist before notices to MP Avinash Reddy

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన నివాసంలోనే అత్యంత దారుణంగా నరికి.. నరికి చంపిన వైనం తెలిసిందే. తొలుత గుండెపోటు అంటూ వార్తలు వచ్చినా.. ఆ తర్వాత అది పక్కా హత్యగా నిర్దారణ కావటం అప్పట్లో సంచలనంగా మారింది. చివరకు ఈ దారుణ హత్యలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందన్న అనుమాల నేపథ్యంలో ఆయనకు నోటీసులు ఇస్తారన్న వాదన వినిపిస్తున్నా.. ఇప్పటివరకు అడుగు ముందుకు పడని పరిస్థితి.మరోవైపు వివేకా కుమార్తె సైతం తన తండ్రి హత్య కేసు విచారణను ఏపీలో కాకుండా వేరే ప్రాంతంలో నిర్వహించాలని.. అప్పుడు మాత్రమే నిజాలు బయటకు వస్తాయని కోరటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాశ్ కు నోటీసులు ఇస్తారా? ఇవ్వరా? అన్నది ప్రశ్నగా మారింది. ఢిల్లీ స్థాయిలో ఎంపీ అవినాశ్ కు నోటీసులు అందకుండా ఉండేందుకు లాబీయింగ్ జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఇప్పటివరకు నోటీసులు ఆగాయని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మంగళవారం (జనవరి 23) అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేకానంద రెడ్డిహత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు సోమవారం పులివెందుల ప్రాంతానికి రావటం.. అక్కడ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటి పరిసరాల్ని పరిశీలించటం చర్చనీయాంశంగా మారింది. అనంతరం అవినాశ్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారా? అని అడగ్గా.. అక్కడి సిబ్బంది లేరని బదులిచ్చారు.

అనంతరం ఓఎస్డీ ఆఫీసుతో పాటు పులివెందులలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా వెళ్లారు. అక్కడేమైనా భాస్కర్ రెడ్డి ఉన్నారన్న ఆరా తీయటం.. అక్కడ కూడా లేరని అధికారులు చెప్పటంతో వెనక్కి వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వేళలో వైసీపీ ఎంపీ అవినాశ్ పులివెందులకు వచ్చారు. ఆయన వచ్చిన కాసేపటికే అవినాశ్ ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నారా? అన్న ప్రశ్నించటం.. లేరిన చెప్పటం జరిగింది.

ఎంపీ అవినాశ్ ను కలిసిన సీబీఐ అధికారులు.. మంగళవారం హైదరాబాద్ లో ఉన్న సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే.. తాను ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం తాను పాల్గొనాల్సిన కార్యక్రమాల్లో పాల్గొనాలని.. ఐదు రోజుల తర్వాతే విచారణకు హాజరు కాగలనని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సీబీఐ అధికారుల సమాధానం ఏమిటో బయటకు రాలేదు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఉదయం తండ్రి కోసం ఆరా తీసి.. సాయంత్రానికి కొడుక్కి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా నోటీసుల జారీ వేళలో సీబీఐ ట్విస్టు ఇచ్చిందన్న మాట వినిపిస్తోంది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.