Begin typing your search above and press return to search.

'బీబీసీ' దెబ్బకు రోల్స్ రాయిస్ కేసు తెర మీదకు వచ్చిందిగా?

By:  Tupaki Desk   |   30 May 2023 3:04 PM GMT
బీబీసీ దెబ్బకు రోల్స్ రాయిస్ కేసు తెర మీదకు వచ్చిందిగా?
X
ఎక్కడో స్విచ్ వేస్తే.. మరెక్కడో లైటు వెలిగిన చందంగా మారింది రోల్స్ రాయిస్ ఎపిసోడ్. దాదాపు ఆరేళ్ల క్రితం పెట్టిన కేసును తాజాగా సీబీఐ తవ్వి తీసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మీద బీబీసీ (బ్రిటన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) వివాదాస్పద రీతిలో డాక్యుమెంటరీ ప్రసారం చేయటం.. దీనిపై కేంద్రం సీరియస్ కావటమే కాదు.. దీని ప్రసారంపైనా ఆంక్షలు విధించటం తెలిసిందే. అనంతరం బీబీసీ ఇండియా మీద సీబీఐ దాడులు జరపటం కూడా అప్పట్లో సంచనలంగా మారింది. కొత్త చర్చకు తెర తీసింది.

ఇదిలా ఉండగా.. తాజాగా బ్రిటన్ కు చెందిన ఏరో స్పేస్.. రక్షణ రంగ సంస్థ రోల్స్ రాయిస్ మీద సీబీఐ కేసు పెట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదంతా కూడా బీబీసీ డాక్యుమెంటరీ ఎఫెక్టుతోనే జరిగిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

హాక్ 115 అడ్వాన్స్ జెట్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్టుల కొనుగోళ్ల డీల్ ను దక్కించుకునేందుకు రోల్స్ రాయిస్ లంచం ఇచ్చిందన్నది సీబీఐ ఆరోపణ. నేవీ.. ఎయిర్ ఫోర్సు కోసం హాక్ 115 అడ్వాన్స్ జెట్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ల కొనుగోళ్ల కాంట్రాక్టు దక్కించుకోవటానికి రోల్స్ రాయిస్ లంచం ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ డీల్ విలువ 734 మిలియన్ పౌండ్లు.

42 ఎయిర్ క్రాప్టుల తయారీకి.. హిందుస్థాన్ ఎరోనాటిక్స్ మెటీరియల్ పంపిణీ చేసేందుకు 308 మిలియన్ డాలర్లు.. లైసెన్స్ ఫీజు కింద మరో 7.5మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే.. ఈ డీల్ ను పూర్తి చేసేందుకు పలువురు ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారన్నది సీబీఐ ఆరోపణ. అవినీతి ఆరోపణల కారణంగానే ఈ డీల్ అక్కడితో ఆగింది.

2016లో దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ.. ఆ తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు. అలాంటిది తాజాగా మాత్రం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయటం గమనార్హం. గుర్రు పెట్టి నిద్ర పోతున్న వేళ.. ఉలిక్కిపడి నిద్ర లేచిన చందంగా సీబీఐ తీరు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రోల్స్ రాయిస్ మీద కేసు నమోదు వెనుక.. బీబీసీ డాక్యుమెంటరీ ఎఫెక్టు ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం.