ఎంపీ రఘురామకృష్ణరాజుకు బైపాస్ సర్జరీ.. మరి కొన్ని రోజులు ఐసీయూలోనే

Tue Dec 01 2020 13:10:00 GMT+0530 (IST)

Bypass surgery for MP Raghuram Krishnam raju

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సోమవారం బైపాస్ సర్జరీ నిర్వహించారు. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో ఆయనకు గుండెకు సంబంధించిన సర్జరీ విజయవంతంగా జరిగింది. కాగా మరో రెండు రోజుల పాటు ఆయన ఐసీయూలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. కాస్త కోలుకున్న అనంతరం ఆస్పత్రిలోని సాధారణ గదికి ఆయనను మార్చనున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు కుటుంబీకులు మాట్లాడుతూ ' ఆయన చికిత్స అనంతరం తిరిగి కోలుకొని రెట్టింపు  ఉత్సాహంతో తన దినచర్యలు నిర్వహిస్తారని ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు సన్నిహితులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా ఎన్నికైన కొద్దిరోజుల్లోనే ఆయన ఢిల్లీలో బీజేపీ అధిష్టానం పెద్దలతో సన్నిహితంగా మెలగడం ఇటు రాష్ట్రంలోనూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా  నడుస్తుండడంతో పార్టీకి ఆయనకు మధ్య దూరం పెరిగింది.ఎప్పుడైతే పార్టీ ఆయనను దూరం చేయడం మొదలైందో అప్పటి నుంచి ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

ప్రతి రోజు టీవీ షోలలో పాల్గొంటున్న రఘురామకృష్ణరాజు రోజూ ఏదో ఒక విషయమై ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. గత నెల 28వ తేదీన అమరావతి కి సంబంధించి ఓ వీడియో విడుదల చేయగా అందులో రఘు రామ కృష్ణరాజు కాస్త ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించింది.  అప్పుడే ఆయన ఆరోగ్యంపై  పలు సందేహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు సోమవారం బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.