Begin typing your search above and press return to search.

బ్రిటన్ కు బడ్జెట్ల గండం.. సునాక్ పదవికీ గండం..?

By:  Tupaki Desk   |   1 April 2023 1:41 PM GMT
బ్రిటన్ కు బడ్జెట్ల గండం.. సునాక్ పదవికీ గండం..?
X
అదుపులేని ద్రవ్యోల్భణం.. కొవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్యలు.. పెరిగిపోయిన జీవన వ్యయాలతో దాదాపు ఏడాదిన్నర కిందట బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. అప్పటికే రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న జాన్సన్.. తీవ్ర ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి గండం, బ్రెగ్జిట్, చివర్లో ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో తీవ్రంగా సమస్యలు ఎదుర్కొన్నారు. జి-7 దేశాల్లో దేనిలోనూ లేనంతటి ద్రవ్యోల్బణం నాడు బ్రిటన్ లో ఉండడం గమనార్హం. వేతనాల్లో స్తబ్ధత నెలకొంది. అదంతా ఒక తరం ఆర్థిక సంక్షోభంగా పేరుగాంచింది. ఈ పరిణామాలతోనే జాన్సన్ పదవి నుంచి వైదొలగారు. ఆయన స్థానంలో లిజ్ ట్రస్ పగ్గాలు చేపట్టారు.

మధ్యంతర బడ్జెట్ తోనే ఖతం

స్వల్ప కాలం కొనసాగిన ట్రస్ పాలనకు.. మధ్యంతర బడ్జెట్ పెను శాపమైంది. వాగ్దానాలకు భిన్నంగా ఉన్న ఆ బడ్జెట్ చివరకు ట్రస్ పదవికి ముప్పు తెచ్చింది. ఆమె స్థానంలో ప్రవాస భారతీయుడైన రిషి సునాక్ పదవిలోకి వచ్చారు. ఆయన ప్రభుత్వం మార్చి ఆరంభంలో ప్రవేశపెట్టిన స్ప్రింగ్‌ బడ్జెట్‌ ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. ''పిల్లల సంరక్షణకు ఆయాల (ఛైల్డ్ మైండర్స్‌) సేవలను అందించే కంపెనీలకు ప్రోత్సాహకాలు'' అనే నిబంధన వివాదాస్పదం అవుతోంది.

ఇందులో రిషి భార్య, భారతీయు దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షితా మూర్తి వ్యాపార ప్రయోజనం దాగుందన్న విమర్శలు వస్తున్నాయి. అసలే ప్రవాసీ.. భారతీయ మూలాలు.. కావడంతో రిషి ప్రత్యర్థులకు సులభంగా టార్గెట్ అయ్యారు.

పైలట్ పథకమే.. అయినా

చైల్డ్ మెంటర్స్ పథకం పైలట్ పథకమే. అంటే ప్రయోగాత్మకంగా అమలు మాత్రమే చేస్తారు. అయితే, ఇలాంటి సేవలనే అందించే 'కోరు కిడ్స్‌ లిమిటెడ్‌' కంపెనీలో అక్షతా వాటాదారు. పైలట్ ప్రాజెక్టే అయినా భార్య వ్యాపార ప్రయోజనాల కోసమే దీనిని ప్రవేశపెట్టారంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ''ఈ స్కీమ్‌ వెనుక ప్రత్యేక ఆసక్తి ఏమైనా ఉందా? సొంత ప్రభుత్వ విధానాల నుంచి రిషి కుటుంబం అదనపు ఆదాయాన్ని పొందాలనుకుంటుందా? సమాధానం చెప్పాల్సిందే'' అని ప్రతిపక్ష లిబరల్‌ డెమోక్రాట్ పార్టీ చీఫ్ విప్ వెండీ ఛాంబెర్లేన్ ఆరోపించారు.

దర్యాప్తు జరిపించాలని డిమాండ్ కూడా చేశారు. అయితే ఈ ఆరోపణలను ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ ఖండించింది. రిషి ప్రధాని కాకముందు కూడా ఆయన భార్య పన్నుల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అక్షతామూర్తి.. యూకే వెలుపల సంపాదించిన సొమ్ముపై పన్నులు చెల్లించట్లేదని ఆయన ప్రత్యర్థులు ఆరోపించారు. ఇది కాస్తా తీవ్ర వివాదస్పదం కావడంతో స్పందించిన అక్షతా.. ఇకపై ప్రపంచవ్యాప్తంగా ఆర్జించే ధనంపై కూడా యూకేలో పన్ను చెల్లిస్తానని అప్పట్లో ప్రకటించారు.

తాజా ఆరోపణల తీవ్రత ఎంత?

పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా యూకేలో రాజకీయాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఆరోపణలు ఒక స్థాయివి అయినా ప్రజాప్రతినిధులు పదవులు కోల్పోతుంటారు. ఇందుకు లిజ్ ట్రస్, జాన్సన్ ఉదంతాలే నిదర్శనం. ఇక తాజాగా సునాక్ విషయానికి వస్తే కొంత ఆందోళన కనిపిస్తోంది. తన భార్య వాటాదారుగా ఉన్న సంస్థ నిర్వహించే కార్యకలాపాలకు అనుగుణంగా పథకం ప్రవేశపెట్టడం అంటే ఒకింత అనుకూలత చూపడమే. మరి దీనిని ప్రతిపక్షాలు ఎంత బలంగా ప్రస్తావిస్తాయో.. సునాక్ ప్రభుత్వం ఎంతగా తిప్పికొడుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.