Begin typing your search above and press return to search.

ఈ తరం చెప్పే లవ్ స్టోరీలకు భిన్నం ఈ రియల్ క్యూట్ స్టోరీ

By:  Tupaki Desk   |   3 Dec 2021 5:37 AM GMT
ఈ తరం చెప్పే లవ్ స్టోరీలకు భిన్నం ఈ రియల్ క్యూట్ స్టోరీ
X
రెండు అక్షరాల ‘ప్రేమ’ను ఇప్పటికి కోట్లాది మంది చెప్పి ఉంటారు. అయినప్పటికీ.. ఏ ఒక్కరి ప్రేమకథ.. మరో ప్రేమకథకు మ్యాచ్ అయ్యేలా ఉండకపోవటమే లవ్ గొప్పదనంగా చెప్పాలి. గతంలో ప్రేమ అనే దానికి.. ఇప్పటికి మధ్య తేడా చాలా పెరిగిపోవటమే కాదు.. అప్పటి తరఫు ప్రేమకు.. ఇప్పటి జెనరేషన్ ప్రేమకు పొంతన లేని పరిస్థితి. ఇలాంటివేళ.. లేటు వయసులో జరిగిన ఒక ప్రేమ పెళ్లి గురించి.. దాని బ్యాక్ గ్రౌండ్ స్టోరీ గురించి తెలిసినంతే.. వావ్ అన్న మాట నోటి నుంచి అప్రయత్నంగా వచ్చేస్తుంది.

కర్ణాటక రాష్ట్రంలోని చిన్న గ్రామంలో జరిగిన ఈ ప్రేమ పెళ్లి ఇప్పుడు సంచలనంగా మాత్రమే కాదు.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ.. హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి గాఢమైన ప్రేమకథ.. ఇప్పటితరానికి సరికొత్త స్ఫూర్తిని ఇస్తుందని చెప్పక తప్పదు. కర్ణాటకలోని మండ్య జిల్లా మేలుకోటెలో జరిగిన ఈ పెళ్లి వెనుక పెద్ద స్టోరీనే ఉంది. వధూవరులు ఇద్దరికి 65 ఏళ్లు. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ ఉన్నప్పటికీ.. వారికి ఈ వయసు వచ్చే వరకు వారి లవ్ స్టోరీ సక్సెస్ కాలేదు.

మైసూరులోని హెబ్బాళ ప్రాంతానికి చెందిన చిక్కణ్ణ.. జయమ్మలకు 65 ఏళ్లు. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. యుక్త వయసులో ఉన్నప్పుడు జయమ్మకు వేరే వ్యక్తితో పెళ్లైపోయింది. దీంతో.. తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లికావటంతో నిరాశకు గురైన అతను.. ఆమె తప్పించి తన లైఫ్ లో మరొకరు ఉండకూడదన్న ఉద్దేశంతో ఒంటరిగా ఉండిపోయాడు.

ఇదిలా ఉంటే.. పెళ్లి చేసుకున్న జయమ్మకు పిల్లలు లేరు. అంతేకాదు.. కొంతకాలం క్రితం ఆమె భర్త అనారోగ్యంతో మరణించారు. దీంతో.. వీరిద్దరూ ఒంటరిగా ఉండిపోయారు. తరచూ కలిసేవారు.. తమ పాత గురుతుల్ని తలుచుకునే వారు. తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. చుట్టూ ఉన్న వారి మాటల్ని పట్టించుకోకూడదని డిసైడ్ అయిన వారు.. 65 ఏళ్ల లేటు వయసులో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ప్రేమకు.. వయసుకు సంబంధం లేదని.. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని విపరీతాలకు పాల్పడే ఎంతోమంది మూర్ఖపు ప్రేమికులు.. ఈ లవ్ స్టోరీని చూసి తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. ప్రేమ అంటే.. మనం ప్రేమించిన వారిని సొంతం చేసుకోవటం కాదు. మనం ప్రేమించిన వారిని అపురూపంగా చూసుకుంటూ.. వారికి అండగా నిలవటం. ఇలాంటి తీరు ఈ తరంలోని వారిలో ఎంతమందిలో కనిపిస్తుందో చెప్పండి.