Begin typing your search above and press return to search.

బొబ్బిలి కోట వైసీపీ చేజారినట్లేనా...?

By:  Tupaki Desk   |   1 April 2023 9:27 AM GMT
బొబ్బిలి కోట వైసీపీ చేజారినట్లేనా...?
X
వైసీపీకి విజయనగరం జిల్లా 2019 ఎన్నికల్లో బ్రహ్మరధం పట్టింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది సీట్లను వైసీపీకి గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిష్టాత్మకమైన బొబ్బిలి కోటలో బొబ్బిలి రాజులను ఓడించి మరీ
మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు గెలిచారు. అయితే గత నాలుగేళ్ల కాలంలోనే ఆయన పట్టు కోల్పోయారు అని అంటున్నారు. ఆయన మీద సొంత పార్టీ నాయకులే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మునిసిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ బలం పెరిగింది. టీడీపీ బొబ్బిలి ఇంచార్జి బేబీ నాయన సారధ్యంలో సైకిల్ జోరుగా పరుగులు తీస్తోంది. వైసీపీని ఢీ కొట్టి మరీ మునిసిపాలిటీలో సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. ఇంకో వైపు వైసీపీ మునిసిపల్ చైర్మన్ పట్ల వైసీపీ కౌన్సిలర్లే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు.

గెలిచిన వైసీపీ కౌన్సిలరలో కొందరు మునిసిపల్ చైర్మన్ కి యాంటీగా మారి గ్రూపు కట్టారు. దాంతో వారికి నచ్చచెప్పలేకపోతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో 21వ వార్డు వైసీపీ కౌన్సిలర్ మరిశర్ల రామారావునాయుడు తన పదవికి రాజీనామా చేశారు.

గెలిచి రెండేళ్ళు అవుతున్నా పార్టీ పరంగా కానీ మునిసిపాలిటీ పరంగా కానీ తన వార్డు అభివృద్ధికి చేసింది ఏమీ లేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే శంబంగి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని, ఆయన గెలిచే పార్టీలోనే ఉంటారని ఘాటైన కామెంట్స్ చేశారు. తాను వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్నా తనను పార్టీ పెద్దలు పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన బాటలో మరి కొందరు కౌన్సిలర్లు కూడా నడవాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బొబ్బిలిలో వైసీపీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అంటున్నారు. ఇటీవల వచ్చిన పలు సర్వేలు సైతం బొబ్బిలి సీటు ఈసారి టీడీపీదే అని డిసైడ్ చేశాయి.

బొబ్బిలిలో 2024లో టీడీపీ గెలిస్తే మాత్రం పాతికేళ్ళ తరువాత అద్భుత విజయం సాధించినట్లు అవుతుందని అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్, వైసీపీలే ఎపుడూ గెలుస్తూ వచ్చాయి. అయితే వైసీపీకి పట్టు ఉన్నా పార్టీ నేతలు సరిగ్గా లేకపోవడం ఎమ్మెల్యే శంబంగికి పార్టీ నాయకులకు మధ్య గ్యాప్ పెరగడం ఆయన ఒంటెత్తు పోకడలు పోతున్నారని విమర్శలు చేయడంతో వైసీపీ ఇపుడు వర్గ పోరుతో సతమతమవుతోంది. ఈ పరిణామాలు టీడీపీకి కొత్త జోష్ ని కలుగచేస్తున్నాయి.

అయితే వైసీపీ ఈసారి కొత్త అభ్యర్ధిని టికెట్ ఇవ్వాలని చూస్తోంది. బొబ్బొలి రాజులలో పెద్ద వారు అయిన మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావుని తమ వైపు తిప్పుకోవడానికి ఆ మధ్య ప్రయత్నాలు చేసిందని ప్రచారం సాగింది. అయితే వైసీపీ గ్రాఫ్ తగ్గుతున్న వేళ ఆ వైపు నుంచి ఎవరూ రారనే అంటున్నారు. పైగా ఈసారి బేబీ నాయనకు ఎమ్మెల్యే అవకాశం టీడీపీ ఇస్తున్న వేళ బొబ్బిలి రాజులు ఇద్దరూ ఒక్కటిగా నిలుస్తారని అంటున్నారు.