వైసీపీ విషయంలో కేంద్రం వ్యూహమేంటి?

Thu Jul 29 2021 15:27:51 GMT+0530 (IST)

What is the central strategy in the case of YCP

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు.. జగన్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూనే ఉంది. 2019 ఎన్నిక లకు ముందు నుంచి కూడా బీజేపీకి జగన్ అన్ని విధాలా జై కొడుతున్నారు. అప్పటి రాష్ట్రపతి ఎన్నికలోనూ.. అడగకపోయినా జగన్ సహకరించారు. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాతకూడా.. సహకరిస్తూనే ఉ న్నారు. రాజ్యసభకు సంబందించి పరిమళ్ నత్వానీకి అడిగిన వెంటనే అవకాశం ఇచ్చిన జగన్.. పార్లమెం టులో కేంద్రం తీసుకువచ్చిన బిల్లులు పాసయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో వివాదాస్పద రైతు చట్టాలను కూడా కేంద్రం ఆమోదించుకుంది.జగన్ సైడ్ నుంచి ఓకే.. కానీ.. మోడీ సైడ్ నుంచి ఏపీకి సహకరిస్తున్నది ఏమైనా ఉందా? అనేది కీలక ప్రశ్న. పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచడం లేదు. అదేసమయంలో ప్రత్యేక హోదా విషయంలోనూ సహ కరించడం లేదు. అసలు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని.. దిశ చట్టానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే.. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో సీఎం జగన్ లేఖలు రాసినా కూడా.. కేంద్రం తన వైఖరిలో మార్పు తీసుకోవడం లేదు. ఇటీవల కరోనా సమయంలో దేశం మొత్తానికి ఆక్సిజన్ అందించిన ఘనతను సొంతం చేసుకున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదు.

మరి ఈ నేపథ్యంలో కేంద్రం వ్యూహం ఏంటి?  ఏపీని చేయాలని అనుకుంటోంది? మరీ ముఖ్యంగా జగన్.. అన్ని రూపాల్లోనూ సహకారం అందిస్తున్నా.. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తోంది? అన్నది కీలకంగా మారింది. ఇక ఈ ఆవేదన నుంచే కాబోలు.. వైసీపీ ఎంపీలు కూడా పరుషంగానే వ్యవ హరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో.. వైసీపీ ఎంపీలు దూకుడుగా ఉన్నారు. రాజ్యసభలో చైర్మన్ పోడియంను వరుసగా మూడు రోజుల పాటు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టుముట్టి.. ఆందోళన చేశారు. పోలవరం అంచనాల పెంపుపై.. లోక్‌సభలో.. మిథున్ రెడ్డి ఆందోళన చేస్తున్నారు.

అయితే.. ఇన్ని చేస్తున్నప్పటికీ.. కేంద్రం మాత్రం తన వైఖరిని స్పష్టం చేయడం లేదు. ఏపీకి సంబం ధించిన విషయాల్లో.. తప్పులన్నీ ఏపీవేననే ధోరణితో వ్యవహరిస్తోంది. పోలవరంపై ఇటీవల సాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు.. అంచనాలు పెంచే ప్రతిపాదన ఏమీలేదని.. మంత్రి షెకావత్ కరాఖండీగా చెప్పేశారు. ఇక విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ విషయంలో 100 శాతం పెట్టుబడులను వెనక్కి తీసుకునేది ఖచ్చితమేనని.. అటు పార్లమెంటులోనూ .. ఇటు ఏపీ హైకోర్టులోనూ కేంద్రం చెప్పేసింది. మొత్తంగా చూస్తే.. ఈ పరిణామాలు.. ఎప్పటికి ముడిపడతాయి.. ఎప్పటికి కేంద్రం సహకరిస్తుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

 ఇదిలావుంటే.. పరిస్థితి ఎప్పుడూ.. ఒకే విధంగా ఉండే అవకాశం బీజేపీ విషయంలో కనిపించడం లేదు. త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కనుక బీజేపీ డింకీలు తింటే.. రాష్ట్రపతి ఎన్నిక సమయానికి వైసీపీ వంటి బలమైన పక్షాల సాయం తీసుకోకతప్పదు. అదేసమయంలో 2024 ఎన్నికల నాటికి మోడీ ప్రభ మసకబారితే.. అప్పుడైనా.. జగన్ వంటి కీలక ప్రజాబలం ఉన్న నేతల మద్దతును కోరక తప్పదు. సో.. ఆయా పరిణామాలను గమనిస్తే.. బీజేపీ ఎప్పటికైనా.. వైసీపీకి సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడక తప్పదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.