Begin typing your search above and press return to search.

గ్రేటర్ లో బీజేపీ వ్యూహం ఇదేనా?

By:  Tupaki Desk   |   25 Nov 2020 7:30 AM GMT
గ్రేటర్ లో బీజేపీ వ్యూహం ఇదేనా?
X
ఒకరు సీమటపాకాయలా పేలుతుంటారు. విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తుంటారు. మరొకరు.. ఆచితూచి మాట్లాడుతుంటారు. మాటల్లో పదును కనిపించినా.. విమర్శల కత్తులకు ఏ మాత్రం చిక్కరు. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల వేళ.. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతానికి భిన్నంగా ఇప్పుడా పార్టీ తెలంగాణలో చెలరేగిపోతోంది.

దుబ్బాక ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాల్లో తనది సెకండ్ ప్లేస్ గా స్పష్టం చేసిన ఆ పార్టీ.. గ్రేటర్ ఎన్నికలతో ఆ విషయాన్ని మరింత బలంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఆ విషయంలో విజయం సాధించిందనే చెప్పాలి. బీజేపీ ప్రచారాన్ని చూస్తే.. ఇద్దరు నేతలు ప్రముఖంగా కనిపిస్తున్నారు. వారిలో ఒకరు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అయితే..మరొకరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తన మాటలతో మంట పుట్టిస్తున్నారు బండి సంజయ్. మంగళవారం నాటి వ్యాఖ్యల్నే తీసుకుంటూ.. తాము అధికారంలోకి వస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేపడతామన్న ఆయన మాటలు రాజకీయంగా పెను సంచలనంగా మారాయి.

నిన్నటి రోజున రాజకీయం మొత్తం ఈ వ్యాఖ్య చుట్టూనే తిరిగింది. దూకుడుగా వెళుతున్న బండి సంజయ్ తీరుకు భిన్నంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం సాగుతోంది. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా సంజయ్ నిలిస్తే.. కిషన్ రెడ్డి మాత్రం కేసీఆర్ సర్కారు వైఫల్యాల్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ..కేంద్రంపై గులాబీ నేతలు చేస్తున్న విమర్శలు.. ఆరోపణల్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వటం లేదన్నప్రధాన ఆరోపణపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. కేంద్రం నిధులతోనే తెలంగాణ డెవలప్ మెంట్ జరుగుతుందన్న విషయాన్ని అందరిని అర్థమయ్యేలా చెబుతున్నారు. నిధుల విషయంలో టీఆర్ఎస్ నేతల విమర్శలకు సవాలు విసురుతూ.. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని దుయ్యబడుతున్నారు. హిందుత్వ వాదనతో బండి సంజయ్ దూసుకెళుతుంటే.. డెవలప్ మెంట్ యాంగిల్ లో కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చూస్తే.. పక్కా ప్లాన్ తోనే బీజేపీ తన ప్రచారాన్ని నిర్వహిస్తుందన్న మాట చెప్పక తప్పదు.