జగన్-బాబులను మోడీ ముంచుతున్నారా?!

Mon Feb 22 2021 16:00:01 GMT+0530 (IST)

Bjp New Strategy On Andhra Pradesh

కొన్ని రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. మరికొన్ని చాలా వింతగా ఉంటాయి. ఎవరు ఎవరికి శత్రువులో?  ఎవరు ఎవరికి మిత్రులో.. తెలుసుకునే లోగానే.. చేతులు కాలిపోవడం.. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోవడం రాజకీయాల్లో కామన్‌గా మారింది. ఇలాంటి రాజకీయాల్లో బీజేపీ నేతలు రాటుదేలారనేది చరిత్ర చెబుతున్న వాస్తవం. వారికి అనుకూలం అనుకుంటే.. ఒకలా.. లేకుంటే మరోలా వ్యవహరించడం కామన్‌గా మారింది. మరీ ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు.. వ్యూహ ప్రతివ్యూహాలు అన్నీ కూడా బీజేపీ లబ్ధి కోసమే తప్ప మరేమీ లేదనేది విశ్లేషకుల మాట.రాజకీయాల్లో నాకది..నీకిది అనేది కామనే అయినా.. కొన్ని కొన్ని సార్లు మాత్రం అంతా నాకే! అనే సిద్ధాం తా లు సైతం తెరమీదికి వస్తున్నాయి. ఇలాంటి సిద్దాంతాలతోనే ముందుకు సాగుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తాము ఎంచుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అన్ని దారులను వినియోగించుకోవడం ఇటీవల కాలంలో బీజేపీకి అలవాటుగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వినిపించడమే కాదు.. బిహార్ కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు.... ప్రస్తుతం పుదుచ్చేరిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు ఏంటో అర్ధమవుతుంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలపైనాబీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఏపీలో కీలక పార్టీలుగా ఉన్న టీడీపీ వైసీపీల విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులను డమ్మీ చేసేలా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి రాజధాని ప్రాజెక్టును ప్రాణంగా భావించారు. దీనిని అభివృద్ధి చేసి.. ఏపీకి లక్షల కోట్ల సంపదను సృష్టించాలని నిర్ణయించుకున్నారు. సన్ రైజ్ స్టేట్‌కు సరికొత్త రాజధానితో సొబగులు అద్దాలని అనుకున్నారు.

అయితే.. రాజధానికి నిధులు సక్రమంగా ఇవ్వకుండా మోడీ అప్పట్లో చంద్రబాబును వేధించుకు తిన్నా రు. దీంతో అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేక పోయారు. ఫలితంగా మోడీ దెబ్బతో బాబు ఒకరకంగా ఇబ్బందిపడ్డారు. ఇక టీడీపీ ఓటమి తర్వాత.. అధికారంలోకి వచ్చిన జగన్.. విశాఖను రాజధానిగా చేయాలని తలపించారు. దీంతో రాజధాని ప్రజలు మోడీపై నమ్మకం పెట్టుకుని ఆయన ఫొటోలకు పాలాభిషేకం కూడా చేశారు. ``అయ్యా మీరు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును రక్షించాలి`` అని ప్రార్థించారు. కానీ మోడీ పట్టించుకోలేదు.

ఇక.. ఇప్పుడు మోడీ విశాఖలో జగన్‌కు సెగ పెడుతున్నారు. విశాఖను రాజధాని చేయాలని అనుకున్న తరుణంలో.. కీలకమైన ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కు ప్రాజెక్టును ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. దీంతో అటు అమరావతి ప్రజలు.. ఇటు విశాఖ ప్రజలు కూడా జగన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే టీడీపీ ఇబ్బంది పడుతుండగా.. మరోవైపు వైసీపీ కూడా ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. ఇలా ఇద్దరినీ ముంచి.. తాము మాత్రం `మతం` పేరుతో ఏపీలో ఓట్లు కొల్లగొట్టి పాగా వేయాలనే పక్కా వ్యూహంతో మోడీ ఉన్నారనే వాదన మేధావుల నుంచి వినిపిస్తుండడం గమనార్హం.