వీ6 నుంచి ఔట్.. టీవీ9లోకి బిత్తిరి సత్తి

Sat Aug 24 2019 12:21:58 GMT+0530 (IST)

Bittiri Satti Out From V6 News

అనుకున్నదంతా అయ్యింది. గడిచిన కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపించిన వార్త నిజమైంది. బిత్తిరి సత్తిగా అందరికి సుపరిచితుడు.. బుల్లితెర మీద కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన తీన్మార్ కార్యక్రమంలో ప్రముఖంగా కనిపించే బిత్తిరి సత్తి వీ6తో తనకున్న అనుబంధాన్ని పక్కన పెట్టేసి టీవీ9లోకి వెళ్లిపోయారు.తీన్మార్ ప్రోగ్రాం అన్నంతనే గుర్తుకు వచ్చేది వార్తలు చదివే సావిత్రక్క.. ఆ వార్తలకు తనదైన హావభావాలతో.. పంచ్ డైలాగులతో.. వెరైటీగా వ్యవహరించే బిత్తిరి సత్తికి ఉన్న పాపులార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఈ కార్యక్రమం పుణ్యమా అని టీవీ ఛానళ్లకు ప్రాణసమానమైన టీఆర్పీ రేటింగ్ లలో ప్రముఖంగా ఉండటమే కాదు.. యూట్యూబ్ లో ఆ వీడియోలకు ఉండే పాపులార్టీ.. వ్యూయర్ షిప్ చాలా ఎక్కువ.

గడిచిన కొన్నేళ్లుగా బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవిని తమ ఛానల్ లోకి తీసుకొచ్చేందుకు అప్పుడెప్పుడో రవిప్రకాశ్ విపరీతంగా ట్రై చేయటం.. ఒక దశలో అందుకు ఓకే అన్నప్పటికీ.. తర్వాతి కాలంలో వీ6 ఓనర్ వివేక్ పర్సనల్ గా పిలిపించుకొని భారీ ఆఫర్ ఇవ్వటంతో రవి వీ6తోనే ఉండిపోయాడు.

ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో సావిత్రి అక్క వీ6 నుంచి బిగ్ బాస్ షో కోసం బయటకు వెళ్లిపోవటం.. అదే సమయంలో టీవీ9ను సొంతం చేసుకున్న రామేశ్వర్ సత్తి కోసం విపరీతంగా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. తాజాగా చేవెళ్ల రవికి తానే పర్సనల్ గా అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చారు టీవీ9 రజనీకాంత్.

తీన్మార్ వార్తలతో పాటు.. పలు కామెడీ షోలు.. ప్రైవేటు ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండే రవిని టీవీ9 ఎలా వాడుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. అదే సమయంలో ఓవైపు సావిత్రి అక్క.. మరోవైపు సత్తి ఎగ్జిట్ తో తీన్మార్ కు గతంలో ఉన్న ఆదరణ ఉంటుందా?  లేదా? అన్నది ఒక క్వశ్చన్ అయితే..ఈ కార్యక్రమం కారణంగానే వీ6 టీఆర్పీ రేటింగ్ లలో నిలదొక్కుకుందన్న మాటలు ఎంతమేర నిజమన్న విషయం మీద కూడా రానున్న రోజుల్లో క్లారిటీ రానుందని చెప్పక తప్పదు.