Begin typing your search above and press return to search.

కేసీఆర్ మంచి నేత‌.. కానీ, నాకే ఇబ్బందిగా ఉంది: బీహార్ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   30 Jan 2023 6:00 AM GMT
కేసీఆర్ మంచి నేత‌.. కానీ, నాకే ఇబ్బందిగా ఉంది:  బీహార్ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, భార‌త రాష్ట్ర‌స‌మితి అధినేత కేసీఆర్‌పై బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల ఖ‌మ్మంలో నిర్వ‌హించిన బీఆర్ ఎస్ ఆవిర్భావ స‌భ‌కు నితీష్‌ను పిలిచినా..ఆయ‌న రాలేదు. పైగా.. త‌న‌ను పిల‌వ‌లేద‌ని ఆయ‌నేస్వ‌యంగా చెప్పారు. ఒక‌వేళ పిలిచినా వెళ్లే వాడిని కాద‌న్నారు. దీంతో కేసీఆర్ చేస్తున్న జాతీయ రాజ‌కీయాల‌పై కొంత గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ఇప్పుడు తాజాగా మ‌రోసారి నితీష్ కుమార్.. కేసీఆర్ గురించి మాట్లాడారు.

కేసీఆర్ మంచి నేత అని నితీష్ వ్యాఖ్యానించారు. అయితే.. కేసీఆర్ ను క‌లుసుకునేందుకు తాను ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని.. అయితే.. ప‌నుల ఒత్తిడి కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. తాజాగా మ‌రోసారి కూడా కేసీఆర్ త‌న‌ను ఆహ్వానించిన‌ట్టు నితీష్ చెప్పారు. వ‌చ్చే నెల 17న ప్రారంభించనున్న తెలంగాణ నూత‌న స‌చివాల‌య భ‌వ‌నం కార్య‌క్ర‌మానికి త‌న‌ను పిలిచార‌ని, అయితే.. ఈసారి  కూడా తాను తెలంగాణ‌కు వెళ్లే ప‌రిస్థితి లేద‌ని నితీష్ చెప్పుకొచ్చారు.  

అయ‌తే.. తన బదులు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జనతా దళ్(యునైటెడ్) అధ్యక్షుడు లలన్ సింగ్ను ఆ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా తాను కోరానని నితీష్‌ తెలిపారు.  "కార్యక్రమానికి రావాలని ఆయన (కేసీఆర్) కోరారు. కానీ ఇక్కడ చాలా పనులు ఉన్నాయని ఆయనకు చెప్పా. పార్టీ నుంచి ఎవరినైనా పంపించాలని ఆయన అడిగారు. లలన్ను వెళ్లమని చెప్పా. తేజస్వికి సైతం ఈ విషయం చెప్పమని కేసీఆర్ అడిగారు. 'నేనైతే చెప్తా కానీ మీరు కూడా వారితో మాట్లాడండి' అని సూచించా. వారిద్దరూ (లలన్, తేజస్వి) హైదరాబాద్ వెళ్తున్నారు`` అని నితీష్ వ్యాఖ్యానించారు.

బంధాలు చెడిపోవు!

హైదరాబాద్లో కేసీఆర్ సభకు వెళ్లినంత మాత్రాన.. కాంగ్రెస్తో తమ భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదని నీతీష్‌ స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి విపక్షాలను ఏకం చేయాలని తాను చేస్తున్న ప్రయత్నాలను విరమించలేదని తెలిపారు. "నేను ఇదివరకు కూడా చెప్పాను. ఆ ఆలోచనను నేను పక్కన పెట్టలేదు. భారత్ జోడో యాత్ర పూర్తవ్వాలని నేను వేచి చూస్తున్నా. ఆ తర్వాత అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటాం. వీలైనంత మందిని కలుపుకొని వెళ్లే కూటమిని ఏర్పాటు చేయడంపై చర్చిస్తాం." అని నీతీశ్ కుమార్ పేర్కొన్నారు.