Begin typing your search above and press return to search.

నీతీశ్.. కావాలనే కుల గణనను కదలిస్తున్నారా..?

By:  Tupaki Desk   |   24 May 2022 4:30 PM GMT
నీతీశ్.. కావాలనే కుల గణనను కదలిస్తున్నారా..?
X
ఓ అంశంపై ఉత్తరాది రాజకీయాలు వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అది కూడా అక్కడి సమాజంలో కీలక పాత్ర పోషించే ఓ అంశంపై కావడం గమనార్హం. బీహార్ సీఎం నీతీశ్ కుమార్ దీనికి కేంద్రం అవుతున్నారు. తమ రాష్ట్రంలో కుల ప్రాతిపదికన జన గణన చేపట్టాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి దేశంలో ఎప్పటినుంచో ఉన్న డిమాండ్ ఇది. జనగణన (సెన్సెస్) కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీంతో కేంద్రమే చేపట్టాల్సి ఉంటుంది. పలు పార్టీలు, బీసీ సంఘాల నుంచి ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదు.
అయితే, నీతీశ్ కుమార్ మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందుకేయనున్నట్లు తెలుస్తోంది. బిహార్ లో కుల గణన చేపట్టే ప్రతిపాదనను అఖిల పక్షం ముందుంచుతానని, అనంతరం జనాభా లెక్కింపు ప్రారంభిస్తామని అంటున్నారు. ఇది ఒకవిధంగా.. నీతీశ్ ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీ బీజేపీకి కలవరం కలిగించేదే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇటువంటి డిమాండ్లు అవకాశం ఉంది.

జనాభా లెక్కలు తీస్తున్నారుగా? అప్పుడేం చేస్తున్నారు? వాస్తవానికి దేశంలో పదేళ్లకోసారి జన గణన చేస్తుంటారు. అలాంటి సమయంలో ఎస్సీ, ఎస్టీల వారీగా, మతాల వారీగా ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గణిస్తున్నారు. ఏ కులంవారు ఎంతమంది ఉన్నారనే అంశాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. 1931లో చివరిసారిగా కులాల వారీగా జనగణన చేపట్టారు. 1941లో అర్ధాంతరంగా నిలిపివేశారు. 1951లో పూర్తిగా రద్దు చేశారు.

కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు తీస్తే.. ఇక్కడో సమస్య ఉంది. తమ బలం ఇది.. మా ఓట్లు ఇన్ని అని కుల సంఘాల నుంచి డిమాండ్లు, రిజర్వేషన్ల పరంగా కొత్త సమస్యలు వస్తాయని కేంద్రం భావిస్తోంది. వివిధ కులాలవారు జనాభాలో తమ సంఖ్య ఎంతో తేలితే వారి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలనో, ఇతర కులాల వారి రిజర్వేషన్‌ను తగ్గించాలనో డిమాండ్‌ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో కేంద్రం అంగీకరించడంలేదు. కానీ, దేశ వ్యాప్తంగా కులగణన కోసం డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. ఈ డిమాండ్ల నేపథ్యంలో యూపీఏ-2 హయాంలో సామాజిక ఆర్థిక సర్వే పేరిట గణన చేపట్టారు. కానీ, వివరాలను వెల్లడించలేదు. మరోసారి అటువంటి ప్రయత్నమేదీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేయలేదు. కేంద్రం నిర్ణయాన్ని తోసిరాజని.. బిహార్‌లో నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

పొగబెడుతున్న బీజేపీని.. ఇరుకున పెట్టేలా.. బీహార్ లో నీతీశ్ పార్టీ జనతాదళ్ యునైటెడ్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. కానీ, ఇక్కడ బీజేపీకే ఎక్కువ (74) సీట్లున్నాయి. జేడీయూ 43 సీట్లలోనే గెలిచింది. కానీ, ఎన్డీఏ తరఫున నీతీశ్ ను ముందుపెట్టి ఎన్నికలకు వెళ్లినందున ఆయననే సీఎం చేసింది. అయితే, బీజేపీ నుంచి నీతీశ్ కు తరచూ ఎత్తిపొడుపులు ఎదురవుతున్నాయి. తమకూ సీఎం సీటు కావాలంటూ డిమాండ్లు వస్తున్నాయి.

ఇది పెద్దగా చర్చనీయాంశం కాకున్నా.. నిప్పు మాత్రం రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే నీతీశ్.. బీజేపీ ముందరికాళ్లకు బంధం వేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కోణంలోనే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ముందుకెళ్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి అనుకూలంగా నడచుకుంటున్నారు. ఆర్జేడీ చీఫ్ తేజస్వియాదవ్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యారు. కులగణన విషయంలోనూ తేజస్వి డిమాండ్‌ మేరకే నిర్ణయం తీసుకున్నారు.

అంతకుముందు తేజస్వితోపాటు అఖిలపక్ష నేతలతో కలిసి ఈ అంశంపై ప్రధాని మోదీని కూడా కలిశారు. కేంద్రం కుదరదని చెప్పడంతో రాష్ట్ర పరిధిలో తామే లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు అయితే పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా కులగణనకు నితీశ్‌ మొగ్గుచూపుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కులాల లెక్కలు తీస్తే.. బిహార్‌లో బీసీ సామాజికవర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారన్నది స్పష్టమవుతుందని, రెండు పార్టీలకు ఇది ప్రయోజనకరమని ఆ ఇద్దరు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, బిహార్‌ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటే రాష్ట్రంలో నితీశ్‌ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది.

అవసరమైతే ఆర్జేడీ ఆదుకుంటుందని ఇక్కడ మరో అంశమూ కనిపిస్తోంది. పొరపాటున నీతీశ్ తో బీజేపీ విభేదించి ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి వస్తే ఆర్జేడీ ఆదుకునే అవకాశం కూడా ఉంటుంది. గతంలో 2015లో జేడీయూ, ఆర్జేడీ ప్రభుత్వమే తొలుత ఏర్పడింది. ఎలాగూ తేజస్విని కలుపుకొని వెళ్తున్నారు కనుక ప్రభుత్వానికి మద్దతు అవసరమైతే నీతీశ్ ఆయన సాయం అడిగే వీలూ ఉంటుంది. అప్పుడు బీజేపీ ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది.