Begin typing your search above and press return to search.

సోనియా ఫ్యామిలీకి బిగ్ షాక్ ... ఆ ట్రస్టులపై దర్యాప్తుకి కేంద్రం ఆదేశం !

By:  Tupaki Desk   |   8 July 2020 11:30 AM GMT
సోనియా ఫ్యామిలీకి బిగ్ షాక్ ... ఆ ట్రస్టులపై దర్యాప్తుకి  కేంద్రం ఆదేశం !
X
సోనియాగాంధీ కుటుంబానికి కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గాంధీ ఫ్యామిలీకి చెందిన చారిటబుల్ ట్రస్ట్‌లపై విచారణకు కేంద్రహోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లు ఐటీశాఖ చట్టం, PMLA, FCRA వంటి చట్టాలను ఉల్లఘించాయని ఆరోపణలున్నాయి. వాటికి చైనా ఎంబసీ నుంచి నిధులు వచ్చాయని బీజేపీ నేతలు సైతం ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయా ట్రస్ట్‌ల అక్రమ లావాదేవీలపై విచారణకు అంతర్ మంత్రిత్వ కమిటీని కేంద్రహోంశాఖ నియమించింది. ఈ కమిటీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ డైరెక్టర్‌ కు నేతృత్వం వహిస్తారు.

1991 లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ని, 2002 లో రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. ఈ రెండు ట్రస్టులను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి నిధులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి మళ్లించారని బీజేపీ అధ్యక్షుడు జెపి. నడ్డా ఇటీవల ఆరోపించారు. ఇకపోతే ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ బోర్డులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పి.చిదంబరం, మన్మోహన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. 1991 లో నాడు మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉండగా.. 100 కోట్లను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి ఇస్తున్నట్టు ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారని నడ్డా గుర్తు చేశారు. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారాలని, ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది.

ఇకపోతే , ఇటీవలే భారత్, చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని.. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని సోనియా, రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై బీజేపీ నేతలు , కేంద్రమంత్రులు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఈ సమయంలోనే గాంధీ కుటుంబానికి చెందిన చారిటబుల్ ట్రస్ట్‌లపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.