Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: ముందస్తు పై జగన్ కీలక వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   7 Jun 2023 4:59 PM GMT
బిగ్ బ్రేకింగ్: ముందస్తు పై జగన్ కీలక వ్యాఖ్యలు!
X
గతకొన్ని రోజులుగా.. మరి ముఖ్యంగా నీతి ఆయోగ్ మీటింగ్, నూతన పార్లమెంట్ భవనం ఓపెనింగ్ ల కోసం జగన్ హస్తినకు వెళ్లిన నేపథ్యంలో "ముందస్తు" కథనాలు ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేశాయి. అక్టోబర్ లో జగన్ అసెంబ్లీని రద్దు చేసి, డిశెంబర్ లో ఎన్నికలకు వెళ్లబోతున్నారంటూ గాసిప్పులు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ విషయాలపై జగన్ స్పష్టత ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు జరగడానికి ఇంకా సమయం ఉన్నా.. జగన్ ముందస్తుకు రాబోతున్నారని ప్రచారం చేస్తూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఏపీలోని విపక్షాలు నిత్యం ప్రకటలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

అవును... కేబినెట్‌ ముగిసిన అనంతరం మంత్రులతో మాట్లాడిన సీఎం జగన్.. ముందస్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఏపీ సీఎం జగన్ తేల్చేశారు. ముందస్తు ఆలోచనే తనకు లేదని, ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం మిగిలి ఉందని తేల్చి చెప్పేశారు. ఇదే క్రమంలో... ఈ 9 నెలలు కష్టపడితే గెలుపు మనదేనని మంత్రులకు సూచించారు.

కాగా, కొన్ని రోజుల క్రితం ఏపీ మంత్రి, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా ముందస్తుపై స్పందించిన సంగతి తెలిసిందే. ప్రజాతీర్పుకు తాము లోబడి ఉంటామని, ప్రజలు తమకు ఇచ్చిన ఐదేళ్లూ పరిపాలిస్తామని, తమకు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం పట్టలేదని స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే... ముందస్తుపై స్పష్టత ఇవ్వడంతో... ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో ఈ టాపిక్ హైడ్ అయినట్లేనన్నమాట!!

ఇక తాజాగా జరిగిన కేబెనెట్ భేటీలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా... మొత్తం 63 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో కీలకంగా... ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లును రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సీపీఎస్ స్థానంలో జీపీఎస్ (గ్యారెంటీ పెన్షన్ స్కీం) బిల్లు ముసాయిదాను ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించింది. ఉద్యోగుల భద్రత కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కూడా తాజాగా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మరింత గుడ్ న్యూస్ లు చెప్పింది ఏపీ సర్కార్. అందులో భాగంగా... కొత్త 12వ పీఆర్‌సీ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. ఇదే క్రమంలో... 2022 జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులందరికీ ఏరియర్స్‌ తో 2.73 శాతం డీఏ వర్తింపజేయనుంది.