Begin typing your search above and press return to search.

రూ.150 లక్షల కోట్లు చేతులు మారటమా? అసలేమిటీ స్కాం?

By:  Tupaki Desk   |   22 Sep 2020 10:10 AM GMT
రూ.150 లక్షల కోట్లు చేతులు మారటమా? అసలేమిటీ స్కాం?
X
రూ.150 లక్షల కోట్లు. ఇంత భారీ మొత్తాన్ని చదవి.. కళ్ల ముందు విజువలైజ్ చేసుకోవటానికే రెండు.. మూడు నిమిషాలుపట్టేంత భారీ మొత్తం. అంతటి భారీ స్కాం ఒకటి బయటకు వచ్చి.. ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రపంచంలోని పలు బ్యాంకుల్ని షేక్ చేస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు పెనుసంచలనంగా మారింది. ఈ షాకింగ్ రిపోర్టు పుణ్యమా అని.. ప్రపంచ షేర్ మార్కెట్ చిగురుటాకులా వణికింది. ఈ వ్యవహారంలో భారత్ లోని బ్యాంకుల పాత్ర పరిమితమే అయినా.. షేర్ మ్కారెట్ ఏకంగా రూ.4.23 లక్షల కోట్ల మదుపరుల సొమ్ము ఒక్కసారిగా ఆవిరైంది. దీంతో.. మరో బ్లాక్ మండే చోటు చేసుకుంది.

అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారిన ఈ స్కాం వివరాల్లోకి వెళితే.. ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) సంస్థ ఉంది కదా. గతంలో పనామా పేపర్స్.. స్విస్ లీక్స్ పేరుతో సంచలనాల్ని నమోదు చేసిన సంస్థ తాజాగా భారీ ఆర్థిక అవకతవకల్ని బయటపెట్టింది. ఈ సంస్థలో 88 దేశాలకు చెందిన 110 వార్తా సంస్థలు సభ్యులుగా ఉన్నారు. 1997-2017 మధ్యనున్న ఇరవై ఏళ్ల కాలంలో ప్రపంచ దేశాల్లోని పలు బ్యాంకుల ద్వారా దాదాపు రూ.150 లక్షల కోట్ల మొత్తం చట్టవిరుద్ధ సొమ్ము చేతులు మారినట్లుగా ఆరోపణలు చేసింది.

ఇందులో ప్రఖ్యాత బ్యాంకులు హెచ్ ఎస్ బీసీ.. డాయిష్ బ్యాంక్.. జేపీ మోర్గాన్ తో సహా పలు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఈ పాపంలో భారత బ్యాంకుల వాటా కూడా ఉన్నట్లు ఐసీఐజే వెల్లడించింది. ఇంతకీ వీరి విషయాల్ని ఎలా పట్టుకున్నారు? అన్న అనుమానం వస్తే.. దానికి సమాధానం చెబుతున్నారు.

అమెరికా ట్రెజరీ శాఖకు చెందిన ఫిన్ సెన్ కు బ్యాంకులు రిపోర్టు చేసిన అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించిన ఫైల్స్ ను విశ్లేషించి ఈ వ్యవహారాన్ని వెలికి తీశారు. ఇంత జరిగినా.. ఇదంతా మోసమేనని తేల్చేయటానికి లేదంటున్నారు. అనుమానాస్పద లావాదేవీలుగా పేర్కొనాలే తప్పించి.. మోసంగా చెప్పలేమంటున్నారు. ఇదిలా ఉంటే.. ఫిన్ సెన్ కు రిపోర్టు చేసిన భారత బ్యాంకుల విషయానికి వస్తే దాదాపు 406 అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా చెబుతున్నారు. వీటి విలువ మన రూపాయిల్లో 3616 కోట్లుగా చెబుతున్నారు. మన దేశానికి సంబంధించిన బ్యాంకుల్ని చూస్తే.. ఎస్ బీఐ.. పీఎన్ బీ.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు.. ఇండస్ ఇండ్ బ్యాంక్.. కోటక్ మహీంద్రా బ్యాంక్.. యెస్ బ్యాంక్.. ఐవోబీ.. కెనరా బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. ఇలా బోలెడన్ని బ్యాంకులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం బ్యాంకుల్ని రానున్న రోజుల్లో ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.