Begin typing your search above and press return to search.

తెలంగాణలో టీచర్ల బదిలీలలోనూ పెద్ద దందా..?

By:  Tupaki Desk   |   27 Jan 2023 10:00 PM GMT
తెలంగాణలో టీచర్ల బదిలీలలోనూ పెద్ద దందా..?
X
తెలంగాణ టీచర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం ఇటీవల పచ్చ జెండా ఊపింది. బదిలీలలతో పాటు పదోన్నతులకు కూడా అవకాశం ఇవ్వడంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే సాధారణ బదిలీలతో తాము ఎక్కడకు మారుతామోనన్న భయం కొందరిలో ఉంది. దీంతో ముందుగానే కొందరు ఉపాధ్యాయులు పైరవీలు మొదలుపెట్టారు. తాము కోరుకున్న చోటుకు మార్చాలని లక్షలకు లక్షలు ముట్ట చెబుతున్నట్లు ఉపాధ్యాయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. శుక్రవారం నుంచి బదిలీల ప్రక్రియ మొదలు కానుంది. కానీ అంతకంటే ముందే కొందరు సీఎం కార్యాలయానికి చెందిన కొందరిని సంప్రదించినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం.

సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా స్కూల్ ఎడ్యేకేషన్ డిపార్ట్ మెంట్ కార్యదర్శి వాకాటి కరుణ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వం 317 ప్రకారంగానే బదిలీలు ఉంటాయి. దీంతో చాలా మంది తాము కోరుకున్న చోట కాకుండా ఇతర ప్రాంతాలకు వెళితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని కొందరు టీచర్లు ఆలోచిస్తున్నారు.

దీంతో తమకు తెలిసిన రాజకీయ నేతలను కలుస్తూ అనుకున్న చోటుకు మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాజకీయ నాయకులు ఉన్నతాధికారులను ఒత్తిడి చేయడంతో కొందరు టీచర్లకు అనుగుణంగా మెమోలు జారీ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

అయితే ఉన్నతస్థాయి నుంచి జరుగుతున్న బదిలీలు తక్షణమే ఆపేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) తాజాగా డిమాండ్ చేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇందులో చాలా వరకు అవకతవకలు జరిగాయని, ఇతరుల ఒత్తిడి కారణంగాణ బదిలీలు చేపట్టొద్దంటూ ఆ కమిటీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇలా ఉన్నతాధికారుల నుంచి మోమోలు జారీ కావడంతో అర్హత కలిగిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఈమేరకు యూఎస్ పీసీ నాయకులు ఉన్నతాధికారులను కలిశారు.

చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు పట్టణ ప్రాంతాలకు రావడానికి ఈ పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కార్యాలయంతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ నేతలు ఈ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాము కోరుకున్న చోటుకు మారిస్తే భారీగానే డబ్బును ముట్టజెపుతున్నారని చర్చించుకుంటున్నారు.

ఇప్పటికే 317పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న టీచర్లు.. ఇప్పుడు పైరవీలు చోటు చేసుకోవడంతో వారు మరింత నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి ఉత్తర్వులు వచ్చిన వారి బదిలీలు ఆపేయాలని టీచర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.