బిగ్ బ్రేకింగ్: ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 22 మంది మృతి!

Wed Apr 21 2021 15:43:15 GMT+0530 (IST)

Big Breaking: Oxygen deprivation kills 22 in hospital

మహారాష్ట్రలో దారుణం జరిగింది. నాసిక్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ లోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ కావడంతో రోగులకు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. దీంతో 22 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.నాసిక్ లోని జాకీర్ హుస్సేన్ మున్సిపల్ ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఆస్పత్రిలో అనేకమంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. దాదాపు 150 మంది రోగులు వెంటిలేటర్ పై ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడి జీవిస్తున్నారు.

బుధవారం మధ్యాహ్నం ఆస్పత్రి బయట ట్యాంకర్ లో ఆక్సిజన్ నింపుతుండగా ట్యాంకర్ లీకైంది.  దీంతో దాదాపు 30 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది.ఈ క్రమంలోనే వెంటిలేటర్ పై ఉన్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

ఆక్సిజన్ లీక్ కావడంతో ఆస్పత్రి ఆవరణ అంతా తెల్లటి మేఘాల వలే కమ్ముకుంది. అగ్ని మాపక సిబ్బంది వచ్చి ఆక్సిజన్ లీక్ కాకుండా నియంత్రించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ అవసరం ఉన్న మరో 30 మందిని వెంటనే వేరే ఆస్పత్రులకు తరలించారు.